బోడు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వార్షిక తనిఖీ
సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
టేకులపల్లి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ యు. వెంకన్నబాబు(DSP Venkanna Babu ) ఆదివారం వార్షిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, పరిసరాలు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది గార్డు విధులు, కిట్‌లను తనిఖీ చేసి పరేడ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా పెంచాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులను ఓపికగా విని, నిష్పక్షపాతంగా స్పందించాలని సూచించారు. స్టేషన్‌లో 5ఎస్ విధానాన్ని అమలు చేస్తూ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన, విధి నిర్వహణలో అప్రమత్తత పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని డీఎస్పీ సూచించారు.