కమ్యూనిటీ హాల్ పనులు వెంటనే ప్రారంభించాలి
- రెండేళ్లు గడిచినా ప్రారంభంకాని నిర్మాణ పనులు...
- ఎమ్మెల్యే కు వినతి పత్రం అందించిన పరిరక్షణ కమిటీ ...
కొత్తగూడెం అక్టోబర్ 2 విజయక్రాంతి: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ బూడిదిగడ్డ ప్రాంతంలో, కమ్యూనిటీ హాల్(community hall) నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బూడిదిగడ్డ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) శిలాఫలకం ఏర్పాటు చేసి, రెండు సంవత్సరాలు పూర్తి కావచ్చిన, ( 2024 )లో కొత్తగూడెం మున్సిపాలిటీ ద్వారా రూ.70 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవటంతో కమిటీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తపరిచారు.
ఈ నేపథ్యంలో 10వ డివిజన్‌తో పాటు 11వ, 49వ డివిజన్లకు చెందిన ప్రజలు సమావేశమయ్యారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఆలస్యం కావడానికి గల కారణాలను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి,నిర్మాణ పనులు ప్రారంభించేలా కార్పొరేషన్ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం సమర్పించారు.
బూడిదిగడ్డతో పాటు పరిసర డివిజన్ల ప్రజలకు కమ్యూనిటీ హాల్ ఎంతో అవసరమని, వివాహాలు, సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, ప్రజా అవసరాలకు ఈ భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే నిధులు మంజూరైనా, నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేధో,సంబంధిత అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బూడిదిగడ్డ పరిరక్షణ కమిటీ కోరింది.
ఈ కార్యక్రమంలో మాజీ కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దామోదర్ యాదవ్, ఈరెల్లి నాగేశ్వరరావు, గొడుగు శ్రీధర్ యాదవ్, కామ్రేడ్ పలనాటి ప్రశాంత్, ఈసం చిన్నస్వామి, సబ్బని సంపత్, ఎండి కాజా, రాజయ్య, రాజు, బూడిదిగడ్డ బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.