పోలీస్ అమరవీరుల స్మరణార్థం సైకిల్ ర్యాలీ
కొత్తగూడెం, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు, టీజీఎస్పీ సిబ్బంది ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ర్యాలీ (Cycle Rally) నిర్వహించారు. ఈ ర్యాలీ కొత్తగూడెం రైల్వే స్టేషన్(Kothagudem Railway Station) సమీపం నుంచి పాత డిపో, పోస్టాఫీస్ సర్కిల్ మీదుగా కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి సేవలను ప్రజలకు తెలియజేయడం, పోలీసుల త్యాగాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశం, సమాజం, ప్రజల రక్షణ కోసం అమరవీరులు చేసిన త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, టీజీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్లు రామకృష్ణారెడ్డి, రంజిత్ కుమార్, సీఐలు వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, ఆర్ఐలు సుధాకర్, కృష్ణారావు, జి.వి. రామారావుతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.