అయ్యప్ప స్వామి ఆధ్యాత్మికత, క్రమశిక్షణ అందరికీ ఆదర్శం
డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్నగర్ (విజయక్రాంతి): అయ్యప్ప స్వామి భక్తి, ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సేవాభావం సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమని మహబూబ్నగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి(Deputy Mayor Surender Reddy) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి భక్తి మార్గం ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణ, సేవాభావం, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
పండుగలు, ఆత్మీయ కలయికలు సమాజంలో స్నేహభావాన్ని, సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. శబరిమల అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సమితి ప్రతినిధులు, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.