కోయగూడెం ఓసీ భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి
సీపీఎం డిమాండ్
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఓపెన్‌కాస్ట్ (ఓసీ) ప్రాజెక్టులో(Open Cast Project) మట్టి, బొగ్గు తవ్వకాల కోసం భూములు కోల్పోయిన గిరిజన భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం టేకులపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోయగూడెం ఓసీ కోసం సుమారు వెయ్యి ఎకరాల సాగు భూములను కోల్పోయిన గిరిజనులకు సింగరేణి యాజమాన్యం ఉపాధి కల్పించాలన్నారు.
ఓసీ లో పనిచేస్తున్న ప్రైవేటు సంస్థలు స్థానిక భూ నిర్వాసితులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వృత్తిపరమైన శిక్షణ లేక పలువురు యువకులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని, వారికి వాల్వో డ్రైవింగ్‌తో పాటు వివిధ సాంకేతిక శిక్షణలు అందించి ఉద్యోగాలు కల్పించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకురావడాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం మండల అధ్యక్షుడు ఈసం నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కడుదుల వీరన్న, మండల కమిటీ సభ్యులు కుంజ రమేష్, పూనెం స్వామి, ఈసం రామకృష్ణ, దనసరి సుదర్శన్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.