గిరిజన విద్యార్థులకు లయన్స్ క్లబ్ చేయూత
గుండాల, అక్టోబర్ 23 (విజయక్రాంతి): గుండాల మండల లయన్స్ క్లబ్(Lions Club) ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థుల వసతి గృహాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కొత్తగూడెం జోన్ చైర్పర్సన్ డాక్టర్ ఉజ్వల్ కుమార్(Chairperson Dr. Ujwal Kumar) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వసతి గృహాలకు నిత్యావసర సరుకులను అందజేశామని వారు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, విద్యాభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
గిరిజన విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, వారి విద్యాభ్యాసానికి తోడ్పడటం సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని, సేవాభావాన్ని పెంపొందించడంతోపాటు విద్యార్థుల అభ్యున్నతికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోవింద నరసింహారావు, విమల్ తదితరులు పాల్గొన్నారు.