మణుగూరు మున్సిపాలిటీని పంచాయతీగా మార్చాలి

21-09-2026 | 07:30pm

మణుగూరు, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మణుగూరు మున్సిపాలిటీ(Manuguru Municipality)ని తిరిగి గ్రామ పంచాయతీగా మార్చి, ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా, మండల కమిటీ నాయకుడు కొమ్ము హుస్సేన్ మాదిగ కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. 2005లో మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 32 వేల మంది ఓటర్లు, 20 వార్డులు ఉన్నారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగక ప్రజలకు పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

ఉపాధి హామీ పథకం వంటి గ్రామీణ ఉపాధి అవకాశాలు అందక గిరిజనులు, నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఇళ్లకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణలు సక్రమంగా లేక ఆస్తులను ష్యూరిటీగా చూపించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆస్తుల పంపకాలు, పేర్ల మార్పులు వంటి కనీస అవసరాలు కూడా పూర్తికావడం లేదన్నారు. మున్సిపాలిటీ అధికారులు పన్నుల వసూళ్లకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఎన్నికలు నిర్వహించడమో, ప్రత్యామ్నాయ పరిష్కారం చూపడమో చేయాలని హుస్సేన్ మాదిగ కోరారు.

మరిన్ని వార్తలు