నిజాయితీతోనే సంస్థ అభివృద్ధి

26-10-2026 | 08:15pm

ఇల్లెందు ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం

ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(Singareni Collieries Company Limited) ఇల్లెందు ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026(Vigilance Awareness Week 2026) సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించే ఈ వారోత్సవాలను “నిజాయితీతో సమృద్ధి” అనే నినాదంతో చేపడుతున్నారు. జీఎం కార్యాలయంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఓ టు జీఎం జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ... ప్రతి ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

విధి నిర్వహణలో లంచం, అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ సమయపాలన పాటించాలని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారోత్సవాల్లో భాగంగా జేకే 5 ఓసీ, కోయగూడెం ఓసీ, ఏరియా ఆసుపత్రి, జీఎం కార్యాలయంతో పాటు వివిధ విభాగాల్లో ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎంలు అజ్మీర తుకారాం, ప్రభాకర్ రావు, నాగలక్ష్మి, సేఫ్టీ ఆఫీసర్ రామదాసు, ఏరియా సర్వే ఆఫీసర్ రామ్మూర్తి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి. సుధాకర్, సివిల్ అధికారి వినయ్ సాగర్, ఇతర అధికారులు, గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు