ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది దుర్మరణం
భండారా: మహారాష్ట్రలోని(Maharashtra) భండారా జిల్లాలో(Bhandara District) శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ట్రక్కు, ఎస్‌యూవీ (SUV) ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మరణించారని పోలీసులు తెలిపారు. లఖ్నీ తాలూకాలోని మనేగావ్, పింపల్‌గావ్ మధ్య తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఒక బొలెరో వాహనం ఐషర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఐదుగురు పెద్దలు, ముగ్గురు పిల్లలు సహా మొత్తం ఎనిమిది మంది మరణించారని ఘటనా స్థలంలోని ఒక పోలీసు అధికారి తెలిపారు. బాధితులు ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్ నుండి జాతీయ రహదారి 53 మీదుగా నాగ్‌పూర్‌కు వస్తున్నారని సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.