రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

10-09-2026 | 03:21pm

గండీడ్: సెప్టెంబర్ 10 విజయక్రాంతి: మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి(Rangareddipalli) సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కోస్గి మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య (50), తండ్రి చంద్రయ్యగా గుర్తించారు. పని నిమిత్తం తన స్వగ్రామమైన బొల్లంపల్లికి వెళ్లిన తిరుపతయ్య తిరిగి ద్విచక్ర వాహనంపై మహబూబ్‌నగర్‌కు(Mahabubnagar) వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన తలకు, ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటున్న తిరుపతయ్య జానంపేట మండలంలోని ఓ పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

ద్విచక్ర వాహనం నుంచి కిందపడిన తిరుపతయ్యను స్థానికులు గుర్తించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది ఈఎంటీ స్వాతి, పైలట్ అక్బర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స అందించి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అనంతరం తిరుపతయ్య వద్ద ఉన్న చరవాణి, రూ.250 నగదు, చేతి గడియారం, విలువైన డాక్యుమెంట్లను ఆయన కుటుంబ సభ్యులకు, వైద్యుల సమక్షంలో 108 అంబులెన్స్ సిబ్బంది అప్పగించారు.

మరిన్ని వార్తలు