ఏఐ.. వినియోగం తెలియాలి!

27-10-2026 | 05:00am

కిరణ్‌కుమార్ అనంత్ :

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)(ఏఐ) ప్రస్తుతం సాంకేతికరంగంలో కీలకంగా మారింది. అయితే, సాంకేతికత అనేది నిత్యాన్వేషణ, నూతన ఆవిష్కరణల వేదిక. ఇప్పుడున్న ఏఐ తర్వాతి కాలంలో నేటి సమాజం, ఉద్యోగాలు(Jobs), ఆర్థిక వ్యవస్థ, వృత్తుల భవిష్యత్తు ఎలా ఉంటుందనే సందేహాలు కలగకమానదు.  మానవ చరిత్రలో అగ్ని, చక్రం, ముద్రణా యంత్రం, విద్యుత్తు, ఇంటర్నెట్(Internet) .. ఇలా కొన్ని సాంకేతికతలు   నాగరికత గమనాన్ని పూర్తిగా మార్చేశాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఈ జాబితాలో చేరనున్న తాజా అధ్యాయం.

కానీ ఇది కేవలం ఒక కొత్త పరికరం కాదు. ఇది మనుషుల మేధోశ్రమను(Human intellectual labor), నిర్ణయాత్మక సామర్థ్యం, సృజనాత్మకతను అనుకరించగల వ్యవస్థ. అందుకే దీని ప్రభావం   విస్తృతంగా కనిపిస్తోంది. ఎంతగా అంటే.. ఇంతకుముందు సమాచారం కోసం గ్రంథాలయాలు, పుస్తకాలు, శోధన యంత్రాలను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఏఐ సహాయకులు తక్షణమే, సంభాషణ రూపంలో జవాబులు ఇస్తున్నారు. ఇది విద్యా విధానాలను, ఆలోచనా శైలిని మార్చేస్తోంది. లాభంగా వేగవంతమైన అభ్యాసం పెరుగుతుండగా, నష్టంగా స్వతంత్ర విమర్శనాత్మక ఆలోచన తగ్గే ప్రమాదం ఉంది.

యువతలో ఒంటరితనం, మానవ సంబంధాల క్షీణత గురించి మానసిక వైద్యులు(Psychiatrists) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సలహా, న్యాయ సహాయం వంటి సేవలు అందరికీ అందించడంలో ఏఐ ఒక వరం కూడా అవుతోంది. ఇక ఇంటర్నెట్ యుగంతో పోల్చితే.. ఆంగ్లం, సాంకేతిక పరిజ్ఞానం(Technology) ఉన్నవారు మరింత ముందుకు పోతుండగా, గ్రామీణ, వెనుకబడిన వర్గాలు వెనుకబడే అవకాశం ఉంది. ఇది సామాజిక న్యాయం దృష్ట్యా తీవ్రమైన ప్రశ్న.

అంతేకాదు, డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారం సృష్టించడం సులభమైంది. దీనివల్ల సత్యాన్ని, కల్పనను వేరు చేయడం రాబోయే దశాబ్దపు అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నదనే వాదనలు ఉన్నాయి. 2026 గ్లోబల్ ఏఐ జాబ్స్ బారోమీటర్ ప్రకారం, ఏఐ ఆధారిత నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు.. మొత్తం ఉద్యోగాల మార్కెట్ కంటే దాదాపు ౮ రెట్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఏఐ నైపుణ్యాలకు సగటు వేతన ప్రీమియం 62శాతానికి పెరిగింది.

అంటే ఏఐ నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు, వేతనాలు రెండూ పెరుగుతున్నాయి. గోల్డ్‌మన్ సాచ్స్ పరిశోధన ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల ఉద్యోగాలు ఏఐ ఆటోమేషన్‌కు గురయ్యే అవకాశం ఉం ది. అమెరికాలో నెలకు సుమారు 16వేల ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా యువత (జెన్ జడ్), ప్రారంభ-స్థాయి ఉద్యోగులపై పడుతోంది. అయితే, స్టాన్‌ఫర్డ్ వర్సిటీ మరో కోణాన్ని చూపుతున్నది. చాట్‌జీపీటీ ప్రవేశం తర్వాత ఏఐ ప్రభావం ఇప్పటివరకు కనిపించలేదని  పేర్కొంది.

అదే సమయంలో 22-25 ఏళ్ల వయసు ఐటి డెవలపర్ల ఉద్యోగాలు 2024 నుంచి దాదాపు 20శాతం తగ్గినట్లు గుర్తించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. 9.2 కోట్ల ఉద్యోగాలు తొలగించబడతాయి.  మొత్తంగా 7.8 కోట్ల ఉద్యోగాల పెరుగుదల ఉంటుందని అంచనా. ఇక భారత్.. అందులో తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఐటీ సేవల రంగం (బీపీవో, కోడింగ్, టెస్టింగ్) మీద ముందుగా ప్రభావం పడొచ్చు.

అదే సమయంలో వ్యవసాయం, చేతిపనులు, స్థానిక సేవలకు ఆర్థిక అవకాశంగా మారవచ్చు. రైతులకు వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, వ్యవసాయ సలహాలు తెలుగులోనే ఏఐ ద్వారా అందించవచ్చు. తెలుగు రాష్ట్రాలు డిజిటల్ గవర్నెన్స్‌లో ముందుంటే, ఈ సాంకేతికతను సామాజిక న్యాయం కో సం ఉపయోగించుకునే అవకాశం ఉంది. చివరిగా ఏఐ అనేది ఉద్యోగాలను తినే రాక్షసి కాదు, అన్ని సమస్యలను తీర్చే మాంత్రికుడు కూడా కాదు. ఇదొక శక్తివంతమై న సాధనం. దీన్ని ఎలా ఉపయోగించుకుంటామన్నదే కీలకం.  

-- వ్యాసకర్త: సాఫ్ట్‌వేర్, 

ఎడ్యుకేషన్ కన్సల్టెంట్

మరిన్ని వార్తలు