ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచాలు
ఇందుప్రియాల్‌లో ‘మన పోలీస్–మన ఊరు’ కార్యక్రమంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్
గజ్వేల్, అక్టోబర్ 27, (విజయక్రాంతి): ప్రజలకు, పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించి, కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళవారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్‌లో ‘మన పోలీస్–మన ఊరు’ కార్యక్రమాన్ని(‘Our Police – Our Village’ programme) నిర్వహించారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ గ్రామాన్ని సందర్శించి, ‘సిద్దిపేట సురక్ష నేత్ర’లో భాగంగా ఏర్పాటు చేసిన 16 సీసీటీవీ కెమెరాలను, గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు కోలాటం, బంజారా గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచాలుగా పనిచేస్తాయని, నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇతర గ్రామాలు కూడా ఇందుప్రియాల్ను ఆదర్శంగా తీసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువత స్మార్ట్ఫోన్ల వ్యసనానికి దూరంగా ఉంటూ గ్రంథాలయంలో పుస్తకాలు చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ సరఫరా, విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌కు పాల్పడవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఆడపిల్లలకు ఉన్నత విద్య అందించి ప్రోత్సహించాలని కోరారు.
గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై 1.5 కిలోమీటర్ల మేర గుంతలను పూడ్చిన దౌల్తాబాద్ పోలీసులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ట్రాఫిక్ భద్రత, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాలపై ముగ్గులు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. యువత, పోలీసుల మధ్య వాలీబాల్ మ్యాచ్ నిర్వహించారు.
కార్యక్రమంలో అదనపు డీసీపీలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, గజ్వేల్ ఏసీపీ నరసింహులు, తోగుట సీఐ శ్రీను, సిఐ లతీఫ్, ఆర్ఐ విష్ణు ప్రసాద్, ఎస్సైలు అరుణ్, నవీన్, బాలకృష్ణ, రేణుక, ఆర్ఎస్ఐ బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.