కులగణనతో సామాజిక న్యాయం

13-10-2026 | 05:05am

తిప్పర్తి శ్రీనివాస్ :

ప్రజాస్వామ్యంలో(Democracy) ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అయితే, సమాజంలో అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయా? సామాజికంగా(Social), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(Economically backward classes) వాస్తవ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలకు కచ్చితమైన సమా ధానాలు లభించాలంటే సమగ్ర గణాంకాలు అవసరం. ఈ నేపథ్యంలో జనగణన తోపాటు కులగణన(Caste Census) నిర్వహించాలనే డిమాండ్‌కు ప్రాధాన్యం ఏర్పడుతోంది. దేశ జనాభా ఎంత? వివిధ ప్రాంతాల్లో ప్రజల జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి? విద్య, వైద్యం, ఉపాధి, గృహవసతి వంటి మౌలిక అవసరాలు ఏస్థాయిలో ఉ న్నాయి? జన గణన ద్వారా ప్రభు త్వం ఇలాంటి కీలక సమాచారాన్ని సేకరిస్తుంది.

అయితే, వివిధ సామాజిక వర్గాల జనాభా, వారి విద్యా స్థాయి, ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధిలో వారి భా గస్వామ్యం వంటి అంశాలపై సమగ్ర సమాచారం కూడా అందుబాటులో ఉంటే ప్రభుత్వ విధానాల రూపకల్పన మరింత వాస్తవికంగా ఉంటుంది. కులగణన ప్రాధాన్యత ఇక్కడే ఉంది. దేశంలోని వివిధ కులాల జనాభాతో పాటు ఆయా వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఏ వర్గం ఎక్కడ వెనుకబడింది? అభివృద్ధి ఫలాలు ఏ వర్గానికి ఎంతవరకు చేరుతున్నాయి? ఎక్కడ ప్రత్యేక చర్యలు అవసరం? వంటి అంశాలను గుర్తించేందుకు ఆధారాలు లభిస్తాయి. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరాలంటే వారి అవసరాలను సరిగ్గా అంచనా వేయాలి. కేవలం అంచనాలు, అభిప్రాయాలు, రాజకీయ వాదనల ఆధారంగా కాకుండా విశ్వసనీయమైన గణాంకాల ఆధారంగా విధానాలను రూపొందించాలి.

విద్యారంగంలో వెనుకబడిన వర్గాలను గుర్తించి మెరుగైన విద్యావకాశాలు కల్పించడం, పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను విస్తరించడం వంటి చర్యలకు సమగ్ర సామాజిక గణాంకాలు దోహదపడతాయి. అయితే, కులగణనతోనే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావించడం సరికాదు. గణాంకాల సేకరణ మొదటి అడుగు మాత్రమే. వాటి ఆధారంగా సమర్థవంతమైన విధానాలను రూపొందించి, నిజాయితీగా అమలు చేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.

భారతీయ సమాజంలో కులవ్యవస్థకు చారిత్రక నేపథ్యం ఉంది. కులం ఆధారంగా కొన్ని వర్గాలు వివిధ రంగాల్లో వెనుకబడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ వాస్తవాలను విస్మరించడం వల్ల అసమానతలు తొలగిపోవు. అదే సమయంలో, కులగణన పేరుతో కులాల మధ్య విభేదాలు పెరగడం కూడా సమాజానికి మేలు చేయదు. కులగణన ఉద్దేశం కులాల మధ్య పోటీని పెంచడం కాదు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పరిస్థితిని గుర్తించి, వారికి సమాన అవకాశాల కల్పనకు అవసరమైన సమాచారాన్ని సమకూర్చడం కావాలి.

భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమానత్వం, సామాజిక న్యాయం, గౌరవప్రదమైన జీవ నం వంటి విలువలను ఆచరణలోకి తీసుకురావడానికి కులగణన ద్వారా లభించే సమాచారం ఉపయోగపడాలి. కులాల మధ్య అంతరాలను పెంచడానికి కాకుండా, అసమానతలను తగ్గించడానికి ఈ ప్రక్రియ దోహదపడాలి. కులగణన నిర్వహణలో పారదర్శకత, కచ్చితత్వం, నిష్పాక్షికతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

కులాల వివరాల సేకరణలో స్పష్టమైన ప్ర మాణాలను పాటించాలి. సమాచార విశ్లేషణ శాస్త్రీయంగా జరగాలి. వ్యక్తుల గోప్యతను కాపాడాలి. సేకరించిన సమాచారాన్ని రాజకీయ ప్రయోజనా ల కోసం కాకుండా సమాజం లో అసమానతలను తొలగించి సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడమే కులగణన అంతిమ లక్ష్యం కావాలి.

-  వ్యాసకర్త సెల్- 9948439565

మరిన్ని వార్తలు