అక్కున చేరని హక్కులు!
భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీకి ప్రత్యేక స్థానముంది. 1949 నవంబర్ 26న రాజ్యాంగా న్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అందుకే ఆ తేదీన రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) జరుపుకుంటున్నాం. ఎన్నో అధ్యయనాలు, చర్చల అనంతరం ఈ రాజ్యాంగం రచించబడినది. ప్రతి పౌరుడికీ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, గౌరవంగా జీవించే హక్కులను కల్పించింది. ఈ రాజ్యాంగ దినోత్సవ నేపథ్యంలో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, సామాన్య ప్రజల హక్కుల పరిస్థితులపై ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరముంది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం కేవలం పాలకులకు అధికారాలిచ్చే పుస్తకం మాత్రమే కాదు. ఆ అధికారాలకు పరిమితులు కూడా విధిస్తూ, ప్రజలకు హక్కులు కల్పించిన సామాజిక సమానత్వపు కరదీపిక. కులం, మతం, ప్రాంతం, భాష, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా జీవించాలనే ఆశయాలను రాజ్యాంగం ముందుకు తీసుకొ చ్చింది. కానీ నేటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే రాజ్యాంగం ఆశించిన సమాజానికి, మనం చూస్తున్న సమాజానికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. రాజకీయ స్వాతంత్య్రం వచ్చిన ప్పటికీ ఆర్థిక, సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించే ధోరణి పెరుగుతోందనే ఆందోళ నలు వ్యక్తమవుతున్నాయి.
హక్కులను అడగడం తప్పా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో తప్పా? ప్రజల సమస్యలపై మాట్లాడటం నేరమా? రైతుల సమస్యలపై పోరాడే రైతు సంఘాలు, కార్మికుల హక్కు ల కోసం ఉద్యమించే కార్మిక సంఘాలు, విద్యార్థుల సమస్యలపై గొంతెత్తే విద్యార్థి సంఘాలు, ప్రజల తరఫున ప్రశ్నించే జర్నలిస్టులు, మేధావులు, సామాజిక కార్యకర్త లు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగాలి. ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ద్వారా ప్రజాస్వామ్యం బలప డదు. ప్రజల హక్కుల కోసం పోరాడేవారిని భయపెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ఆర్టికల్ 19 ప్రతి పౌరుడికి భావప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు అందులో భాగమే. అయితే ఆ స్వేచ్ఛపై రాజ్యాంగం పేర్కొ న్న కొన్ని సమంజసమైన పరిమితులున్నా యి. కానీ ఆ పరిమితుల పేరుతో ప్రజల గొంతుకలను మూయించే పరిస్థితి రాకూడదు. ఒక జర్నలిస్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఒక విద్యార్థి హక్కుల కోసం మాట్లాడినా, ఒక కార్మిక నాయకుడు సమస్యలను లేవనెత్తినా, ఒక సామా జిక కార్య కర్త ప్రజా సమస్యలను బయటపెట్టినా వారిని భయపెట్టే వాతావరణం ఏర్పడితే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది?
చట్టసభల తీరు ఆందోళనకరం
పార్లమెంటు అనేది ప్రజల సమస్యలపై చర్చ జరగాల్సిన అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక. అధికార పక్షం తన విధానాలను వివరించాలి. ప్రతిపక్షం వాటిలోని లోపాలను ప్రశ్నించాలి. ప్రజలకు సంబంధించిన చట్టాలపై విస్తృత చర్చ జరగాలి. కానీ ప్రతిపక్షాల గొంతుకలకు తగిన అవకాశం లేకుండా చట్టాలు ఆమోదం పొందుతున్నాయనే విమర్శలు ప్రజాస్వామ్య వ్యవ స్థపై ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిపక్షం బలహీనపడటమంటే కేవలం కొన్ని రాజకీయ పార్టీలకు కలిగే నష్టం కాదు. ప్రజల కు ఉన్న ప్రత్యామ్నాయ రాజకీయ స్వరం మూగపోవడమే. పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతుక నినదించాలి, వీధుల్లో ప్రజా ఉద్యమాల గొంతుక కూడా వినిపించాలి.
నేడు దేశంలో రైతులు పంటలకు గిట్టుబా టు ధర కోసం పోరాడుతున్నారు. కార్మికు లు తమ హక్కులు, ఉద్యోగ భద్రత కోసం ఉద్యమిస్తున్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ విద్యా, వైద్య రంగాల పరిస్థితి, పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికులు, కర్షకులు కనీస జీవన అవసరాల కోసం పోరా డాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెట్టుబడిదారీ విధానంలో పెరుగుతున్న ఆర్థిక అస మానతలు పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. కుల వివక్ష, మత విద్వేషాలు, మహిళలపై దాడులు, దళితులు, ఆదివాసీల హక్కుల సమస్యలెన్నో వెంటాడుతున్నాయి. ఇలాం టి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజల హక్కు. వాటిని పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత.
జవాబుదారీతనం ఎక్కడ?
రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో సమాచార హక్కు కూడా ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమైనది. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత ఉండాలి. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తున్నారు? ప్రభుత్వ పథకాలు ఎవరికి చేరుతున్నాయి? ప్రజలకు అందాల్సిన సంక్షేమం ఎక్కడ ఆగిపోతోం ది? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సమా చార హక్కు చట్టం ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవినీతిని బయట పెడుతున్నారు. ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రశ్నిం చే వ్యవస్థలు బలహీనపడితే అవినీతికి, అధికార దుర్వినియోగానికి అవకాశం పెరుగుతుంది. ప్రజలకు జవాబుదారీ గా ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే.
భారత రాజ్యాం గం లౌకికవాదాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, సోదరభావాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ మతం పేరుతో ప్రజల మధ్య విభజనలు సృష్టించడం, కులం పేరుతో వివక్ష చూప డం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకోవడం దేశ ఐక్యతకు మంచిది కాదు. ప్రజల మధ్య మత, కుల విభేదాలను పెంచడం వల్ల అసలు సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, విద్య, వైద్యం వంటి అంశాలు వెనుకబడిపోతున్నాయి. కార్మికుడు ఏ మతానికి చెందినవాడైనా అతని శ్రమ విలువ ఒకటే. రైతు ఏ కులానికి చెందినవాడైనా అతని కష్టానికి గిట్టు బాటు ధర రావాలి. ప్రజలను మతం, కులం పేరుతో విడదీయ కుండా వారి హక్కుల కోసం ఐక్యం చేయడమే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి.
ప్రజల్లో చైతన్యం రావాలి!
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన సంఘాల బాధ్యత మరింత పెరుగు తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై ఉద్యమించడం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యపరచడం ప్రజాస్వామ్యానికి అవసరం. ముఖ్యంగా వామపక్ష ఉద్యమాలు కార్మిక, కర్షక ఐక్యతను బలోపేతం చేస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, ఆర్థిక ప్రజా స్వామ్యం కోసం పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే దేశాన్ని విమర్శించడం కాదు.
దేశమంటే కేవలం పాలకులు కాదు, ఈ దేశాన్ని తమ శ్రమతో నిర్మిస్తున్న కో ట్లాది మంది కార్మికులు, రైతులు, ప్రజలు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటా యి. కానీ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల చేతుల్లో సజీవంగా ఉం డాలి. రాజ్యాంగాన్ని కాపాడటం అంటే కేవలం నవంబర్ 26న రాజ్యాంగ పీఠికను చదవడం, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేయడం మాత్రమే కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి పేదవాడికి, ప్రతి కార్మికుడికి, ప్రతి రైతుకు, ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థికి అందేలా పోరాడాలి. సమానత్వం పుస్తకాలకే పరిమితం కాకూడదు. సామాజిక న్యాయం నినాదంగా మిగిలిపోకూడదు. ఆర్థిక అసమానతలు తగ్గాలి. విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. భావప్రకటనా స్వేచ్ఛ ఆచరణలో ఉండాలి. కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో సరిపెట్టకుండా సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం దిశగా దేశం ముందుకు సాగాలి.
హక్కులను హక్కుగా గుర్తించాలి!
రాజ్యాంగం మనకు ఇచ్చిన అత్యంత విలువైన హక్కుల్లో ప్రశ్నించే హక్కు ఒకటి. ఆ హక్కును ఉపయోగించుకోవడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే. అధికా రంలో ఎవరున్నా రాజ్యాంగానికి లోబడి పాలించాలి. ప్రజలే అసలైన యజమానులు, ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదా రీగా ఉండాలి. రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత కాదు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరి బాధ్యత.
ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనమంతా ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం కేవలం పాలకుల చేతు ల్లో ఉండాల్సిన పుస్తకం కాదు. అది ప్రతి పౌరుడి జీవితంలో అమలు కావాల్సిన హక్కుల హామీ. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, ప్రజాస్వామ్యా న్ని కాపాడుకుందాం, మతతత్వాన్ని వ్యతిరేకిద్దాం, సామాజిక అసమా నతలపై పోరాడుదాం, ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలుద్దాం. రాజ్యాంగం బతికితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యం బతికితేనే సామాన్యుడి గొంతుకు విలువుంటుంది. కార్మిక, కర్షకుల ఐక్యతతోనే సమానత్వ సమాజ నిర్మా ణం సాధ్యమవుతుంది.
సెల్: 9533687400
ఆర్ అరవింద్