ఉద్యమకారులకు అండగా
లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
ఉద్యమకారులను గుర్తించి అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం
హనుమకొండ,(విజయక్రాంతి): ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన లింగాల కేదారి, పుష్పలత దంపతుల కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరు చేసిన రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కును శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy), వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెక్కును అందజేసి, కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ(Telangana movement) సమయంలో ఆనాటి ఉద్యమకారులకు ఆపన్నహస్తం అందిస్తూ అండగా నిలిచిన లింగాల కేదారి సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం గుర్తించి, ఆయన కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో పోరాడిన ఉద్యమకారులను ప్రజా ప్రభుత్వం గౌరవిస్తుందని, రానున్న రోజుల్లోనూ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఈ వి శ్రీనివాస్, శ్రీనివాస్, చందా మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.