ములుకనూరు సహకార సంఘం.. దేశానికి ఆదర్శం

31-10-2026 | 10:30am

మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి

భీమదేవరపల్లి,(విజయక్రాంతి): ములుకనూరు సహకార సంఘం భారతదేశానికి ఆదర్శనీయమని   మాజీ మంత్రి డాక్టర్ జి. చిన్నారెడ్డి కొనియాడారు.  గ్రామీణ అభివృద్ధి సంస్థ మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి ములుకనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సంఘాన్ని శనివారం సందర్శించారు. సహకార రంగంలో ములుకనూరు సంఘం సాధించిన అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంఘం విజయవంతమైన పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఆయనతో పాటు తెలుగు ప్రొఫెసర్ గంటా జలంధర్ రెడ్డి, రొండ్ల సందీప్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంఘం అధికారులు ప్రత్యేకంగా రూపొందించిన లఘుచిత్రం ద్వారా సంఘం ఆవిర్భావం, ప్రస్థానం, రైతుల అభ్యున్నతి కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, వ్యవసాయ రంగానికి అందిస్తున్న సేవలు, ఆధునికీకరణ చర్యలు సంఘంలోని వివిధ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సదుపాయాలను సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు.

సంఘం అధికారులు, సిబ్బంది ప్రతి విభాగం కార్యకలాపాలను ఆయనకు వివరంగా తెలియజేశారు.ఈ సందర్భంగా  జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ, ఇంతటి అద్భుతమైన సహకార సంస్థను సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ములుకనూరు సహకార సంఘం అభివృద్ధి వెనుక దూరదృష్టి కలిగిన నాయకత్వం, రైతుల పట్ల నిబద్ధత, సేవాభావం ఉన్నాయని ప్రశంసించారు.సహకార సంఘాలు రెండు వైపులా పదునున్న కత్తి వంటివని, వాటి ద్వారా మంచి జరగవచ్చు, చెడు కూడా జరగవచ్చని వ్యాఖ్యానించారు. అయితే ములుకనూరు సహకార సంఘం నాయకత్వం నిబద్ధతతో కూడిన, మానవీయ విలువలతో కూడిన నాయకత్వం ఉంటే సహకార వ్యవస్థ ద్వారా ఎంతటి గొప్ప మార్పును తీసుకురావచ్చో నిరూపించిందని అన్నారు. రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపుతూ, వారి కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్న ఈ సంస్థ పనితీరు నిజంగా ప్రశంసనీయమని తెలిపారు.

ములుకనూరు తరహా సహకార సంస్థలు తెలంగాణలోని ప్రతి ప్రాంతంలోనే కాకుండా, దేశంలోని ప్రతి మూలలోనూ ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలంటే బలమైన, సమర్థవంతమైన సహకార వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా సహకార సంస్థల అభివృద్ధి, రైతుల సంక్షేమం వంటి అంశాలు రాజకీయ సిద్ధాంతాలు, పార్టీలకు అతీతంగా జరగాలని, ములుకనూరు నాయకత్వం ఆచరణలో చూపిస్తున్న విధానం దేశంలోని ఇతర సహకార సంస్థలకు ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు.రైతు కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా సహకార స్ఫూర్తితో సాగుతున్న ములుకనూరు ప్రస్థానం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ మేనేజర్ మార్పాటి రామ్ రెడ్డి , ఏజీఎం ఓలాద్రి సతీష్ బ్యాంకు సిబ్బంది వేణుమాధవ్ తో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు