107 ఏళ్ల పోరాట ప్రస్థానం..ఏఐటీయూసీ సమరశంఖం!

31-10-2026 | 11:21am

బాన్సువాడ, అక్టోబర్ 31 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు సంఘం జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సంఘమని తెలిపారు. ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా అనేక కార్మిక చట్టాలు అమలులోకి వచ్చాయని గుర్తుచేశారు. 

ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే పండుగలు, జాతీయ సెలవులతో పాటు ప్రసూతి సెలవులు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రేణుక, సురేఖ, సంగీత, కళ్యాణి, అనురాధ, వినోదతో పాటు ఏఐటీయూసీ నాయకులు చెన్నంగారి సురేష్, తోట శ్రీనివాస్, ప్రభాకర్, లింగరాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు