వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు వచ్చేశాయ్

31-10-2026 | 11:27am

వాట్సాప్‌లో అదిరిపోయే 4 కొత్త ఫీచర్లు.. ఇక గ్రూప్ చాట్స్ మరింత ఈజీ!

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ WhatsApp తన Group Chats అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు నాలుగు కొత్త ఫీచర్లను ప్రకటించింది. గ్రూప్‌లో కొత్తగా చేరిన సభ్యులకు పాత మెసేజ్‌లను షేర్ చేయడం నుంచి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికీ పిన్ చేసి ఉంచడం వరకు పలు సదుపాయాలను తీసుకొస్తోంది. ఈ అప్‌డేట్స్‌తో గ్రూప్‌లో జరిగే చర్చలను కొత్త సభ్యులు కూడా సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రూప్ అడ్మిన్లు, సభ్యులకు సమయం ఆదా కావడంతో పాటు ముఖ్యమైన సమాచారం కోసం పాత చాట్స్ వెతికే ఇబ్బందులు తగ్గనున్నాయి.

1. ఇక ఎప్పటికీ మెసేజ్ పిన్ చేసుకోవచ్చు

వాట్సాప్‌లో ఇప్పటివరకు గ్రూప్ సభ్యులు గరిష్ఠంగా నాలుగు మెసేజ్‌లను మాత్రమే Pin చేసుకునే అవకాశం ఉంది. వాటిని 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల పాటు కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. తాజా అప్‌డేట్‌తో ముఖ్యమైన సందేశాలను ఎలాంటి Time Limit లేకుండా శాశ్వతంగా పిన్ చేసి ఉంచుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో గ్రూప్‌లో షేర్ చేసిన ముఖ్యమైన వివరాలు, ఈవెంట్ సమాచారం, కీలక సూచనలు ఎప్పుడైనా సులభంగా చూసుకోవచ్చు.

2. కొత్త సభ్యులకు పాత చాట్ హిస్టరీ షేర్

గ్రూప్‌లో కొత్తగా చేరిన వారికి గతంలో జరిగిన చర్చలు తెలియకపోవడం సాధారణం. ఈ సమస్యకు పరిష్కారంగా Chat History Sharing ఫీచర్‌ను వాట్సాప్ విస్తరిస్తోంది. గతంలో కొత్త సభ్యుడిని గ్రూప్‌లో చేర్చే సమయంలోనే అడ్మిన్లు పాత చాట్ హిస్టరీని షేర్ చేయగలిగేవారు. ఇకపై ఆ సమయంలో మిస్ అయినా తర్వాత కూడా కొత్త సభ్యుడికి పాత సందేశాలను పంపవచ్చు. ఇందుకోసం ఇటీవల గ్రూప్‌లో చేరిన సభ్యుడి పేరుపై క్లిక్ చేసి అడ్మిన్లు లేదా గ్రూప్ మేనేజర్లు ఈ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. ఈ సందేశాలకు End-to-End Encryption భద్రత కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది.

3. మీ పేరుతో వచ్చిన మెన్షన్లకు ప్రత్యేక ఫిల్టర్

గ్రూప్ చాట్స్‌లో రోజూ వందలాది మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిలో మనల్ని ఎవరు Mention చేశారో గుర్తించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు కొత్త Mentions Filter తీసుకొస్తోంది. ఈ ఆప్షన్ ద్వారా గ్రూప్‌లో తమను Tag చేసిన సందేశాలను ప్రత్యేకంగా ఫిల్టర్ చేసుకుని చూడవచ్చు. దీంతో అవసరమైన సమాచారం మిస్ కాకుండా వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది.

4. గ్రూప్ సభ్యులకే ప్రత్యేక స్టేటస్

ఇకపై వాట్సాప్ గ్రూప్ సభ్యుల కోసం ప్రత్యేకంగా Status షేర్ చేసుకునే సదుపాయం కూడా రానుంది. అంటే ఎంపిక చేసిన గ్రూప్ సభ్యులకు మాత్రమే కనిపించేలా స్టేటస్ పెట్టుకోవచ్చు. సాధారణ వాట్సాప్ స్టేటస్‌లాగే ఇది కూడా 24 గంటల తర్వాత Expire అవుతుంది. అంతేకాకుండా ఇతర సభ్యులు ఆ స్టేటస్‌కు Reply ఇవ్వడంతో పాటు తమ Statusను కూడా జోడించవచ్చు.

దశలవారీగా అందుబాటులోకి కొత్త అప్‌డేట్స్

ఈ నాలుగు ఫీచర్లను దశలవారీగా (Rollout) అందుబాటులోకి తీసుకురానున్నట్లు WhatsApp వెల్లడించింది. అందువల్ల ప్రతి యూజర్‌కు ఒకేసారి ఈ ఆప్షన్లు కనిపించకపోవచ్చు. తాజా Versionకు యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడంతో పాటు మీ అకౌంట్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయో లేదో పరిశీలించుకోవచ్చు. మొత్తంగా ఈ మార్పులతో WhatsApp Group Management మరింత సులభంగా మారనుంది.

మరిన్ని వార్తలు