పీహెచ్‌సీలో కలెక్టర్ సడన్ ఎంట్రీ..సీరియస్ ఆదేశాలు!

30-10-2026 | 03:11pm

హనుమకొండ, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రికి ప్రతిరోజూ ఎంతమంది రోగులు ఓపీ సేవల (OP Services) కోసం వస్తున్నారు? వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారా? అనే అంశాలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని పురుషులు, మహిళల వార్డులతో పాటు ఓపీ నమోదు ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం టీకాల గది, వైద్య రికార్డుల విభాగం, మందుల నిల్వ గదిని తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలను అడిగి తెలుసుకుని హాజరు పట్టికను పరిశీలించారు. మందుల నిల్వ, పంపిణీ (Medicine Management) సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు