స్థానికులకు ప్రత్యేక టోల్ పాస్
టోల్ ప్లాజాల సమీపంలో నివసించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన స్థానికులకు ప్రత్యేక వార్షిక పాస్ (Concessional Local Pass) అందించనుంది. అయితే ఈ పాస్ కోసం ఏడాదికి రూ.1,500 చెల్లించాలనే నిబంధన అన్ని ప్రాంతాలకూ వర్తించదు. టోల్ ప్లాజా మున్సిపల్ లేదా పట్టణ పరిధి వెలుపల ఉంటే రూ.1,500, ఆ పరిధిలో ఉంటే రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం నవంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది.
టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాణిజ్యేతర వాహనాల యజమానులు ఈ పాస్‌కు అర్హులు. వాహనానికి చెల్లుబాటయ్యే, పనిచేస్తున్న ఫాస్టాగ్ (FASTag) ఉండాలి. అది వాణిజ్యేతర వాహనానికి అనుసంధానమై ఉండాలి. అర్హులు ప్రస్తుతం ఉన్న నెలవారీ పాస్ లేదా కొత్త వార్షిక పాస్‌లో తమకు అనుకూలమైనదాన్ని ఎంచుకోవచ్చు.
ఈ వార్షిక పాస్ ఏ టోల్ ప్లాజా కోసం తీసుకుంటే దానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతర టోల్ ప్లాజాల్లో ఉపయోగించడానికి వీలుండదు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై క్లోజ్డ్ యూజర్ ఫీ కలెక్షన్ (Closed User Fee Collection) విధానం అమల్లో ఉన్న చోట ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. వాహనదారులు వినియోగించేందుకు సర్వీస్ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రహదారి ఉన్నచోట కూడా ఈ పాస్ జారీ చేయరు.
నవంబర్ 1 నుంచి అర్హత కలిగిన టోల్ ప్లాజాల వద్ద వార్షిక పాస్ అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 1 నుంచి రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ (Rajmargyatra App) ద్వారా కూడా పొందవచ్చు. ఈ నిబంధనలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సవరించిన జాతీయ రహదారుల ఫీజు నిబంధనల ద్వారా అమల్లోకి తీసుకొచ్చింది. తరచూ ఒకే టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే అర్హులైన స్థానికులకు ఈ విధానం ఆర్థికంగా ఊరటనివ్వనుంది.