ఏడడుగుల బంధం.. చివరి మజిలీలోనూ కలిసే!
వీపనగండ్ల, అక్టోబర్ 30: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్చర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకరి మరణాన్ని తట్టుకోలేక మరొకరు కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీరని శోకం అలుముకుంది. ఒకే రోజు వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గ్రామానికి చెందిన చాకలి నిరంజన్ గురువారం గుండెపోటుతో (Heart Attack) మృతి చెందారు. భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న భార్య చాకలి మొగులమ్మ.. ఆయన అంత్యక్రియలు (Funeral Rites) ముగిసిన కొద్దిసేపటికే రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మొగులమ్మ తుదిశ్వాస విడిచారు.
ఒకరి వెంట ఒకరు భార్యాభర్తలు ఇద్దరూ మృత్యువాత పడటంతో పుల్గర్చర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారుల పరిస్థితి స్థానికులను కలచివేసింది. క్షణాల్లోనే కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.