బీసీల హక్కులపై దేశవ్యాప్త పోరాటం

21-09-2026 | 05:15am
  1.    2027 జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి
  2.    50 శాతం రిజర్వేషన్ పరిమితిపై పునరాలోచించాలి
  3. ఈబీసీ రిజర్వేషన్లను తామెప్పుడు వ్యతిరేకించలేదు 
  4. ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు 

హైదరాబాద్/ముషీరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): బీసీల హక్కులు(Backward Classes), సామాజిక న్యాయం(Social Justice) కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం అవసరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు(V. Hanumantha Rao)  పేర్కొన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కించినప్పుడే జనాభా ప్రాతిపదికన వారికి న్యాయమైన ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు.

బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో ఆదివారం ఓబీసీ జనగణనపై ‘కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు.. ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ’పై జాతీయ ఓబిసి సదస్సు నిర్వహించారు. వీహెచ్‌తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), జహీరాబాద్ ఎంపి సురేష్‌కుమార్ షెట్కర్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీ హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టి సమగ్ర ఎంపిరికల్ డేటాను సేకరించిందన్నారు.

కేబినెట్ చర్చ, శాసనసభ తీర్మానం, రాజ్యాంగపరమైన ప్రక్రియలు పూర్తి చేసి గవర్నర్ ఆమోదంతో నివేదికను కేంద్రానికి పంపినట్లు తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే కచ్చితమైన గణాంకాలు అవసరమని తెలిపారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50 శాతం రిజర్వేషన్ పరిమితి అడ్డంకిగా మారకూడదని పేర్కొన్నారు.

బీసీల జనాభా, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర డేటా ఆధారంగా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కులగణన కోసం కాంగ్రెస్ జాతీయ స్థాయిలో వంద రోజుల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఓబీసీలందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఓబీసీలకు న్యాయం చేయాలని రాహుల్‌గాంధీ బలమైనా ఆకాంక్షతో ఉన్నారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి స్వీయ ప్రకటన ఆధారంగా కుల గణన పూర్తి చేసినట్లు తెలిపారు. ఎంపి సురేష్ కుమార్ షెట్కర్ మాట్లాడుతూ తెలంగాణను రోల్ మోడల్ తీసుకుని కేంద్రం జనగణనలో కులగణన చేపట్టాలని కోరారు. కుల్కచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఓబీసీ కాలమ్ చేర్చే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు.

విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలన్నారు. సదస్సులో రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ అధ్యక్షుడు భబన్ రావు తైవాడే, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్, బి.మణిమంజరి, కనకాల శ్యామ్ కుర్మా, ప్రొఫెసర్ సంగాని మల్లేశ్వర్, పిఎల్ విశ్వేశ్వరరావు, కుందారం గణేషాచారి, జాజుల లింగం గౌడ్, తారకేశ్వరి, ఓబీసీ నాయకులు, మేధావులు, ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ఓబీసీ నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు