ఎంజీఎంలో పెచ్చులూడుతుంటే.. బాధ్యత ఎవరిది?
ఎంజీఎంలో రోగుల ప్రాణాలతో చెలగాటమా?
సెప్టెంబర్ 20, విజయక్రాంతి: వరంగల్ ఎంజీఎం(Warangal MGM) ఆసుపత్రిలో స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలైన ఘటన కలకలం రేపుతోంది. ఆరోగ్యశ్రీ వార్డులో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు కూలడంతో చికిత్స పొందుతున్న మస్తాన్ (55)తో పాటు అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార్ (33) గాయపడ్డారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే రోగులకు వైద్యం అందించాల్సిన ఆసుపత్రిలోనే భద్రతకు భరోసా లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవనం పరిస్థితి ముందే తెలియదా? నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు మేల్కొంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రోగులు, వారి బంధువుల భద్రతకు బాధ్యత ఎవరిది? ఆసుపత్రి భవనాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారా? ఎంజీఎం ఘటనపై అధికారులు స్పందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.