7 September, 2026 | 5:51 AM

భద్రతా లోపాలు.. బలికోరిన మిషన్

07-09-2026 | 05:10am
  1. ముచ్చర్ల  శివారులోని పేపర్ పరిశ్రమలో ఘోరం
  2. యంత్రంలో చిక్కుకుని మహిళా కార్మికురాలు మృతి
  3. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం ఆస్పత్రికి తరలింపు
  4. యజమాన్యం తీరుపై తోటి కార్మికుల తీవ్ర ఆగ్రహం
  5. పరిశ్రమ గేటు వద్ద భగ్గుమన్న నిరసన
  6. న్యాయం చేయాలని డిమాండ్

హత్నూర, సెప్టెంబరు 5: పనిచేసే చోట కనీస భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం మరో పేద కార్మికురాలి ప్రాణాలను బలిగొంది. పరిశ్రమ యజమాన్యం నిర్లక్ష్యం, రక్షణ చర్యల లోపంతో యంత్రం కొంగును లాగేయడంతో ఒక మహిళా కార్మికురాలు మిషన్లో పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామంలోని ‘సువర్ణదుర్గ పేపర్ పరిశ్రమ’(Suvarnadurga Paper Industry)లో శనివారం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రం గూడ జిల్లా పత్రగాయి గ్రామానికి చెందిన సిమోతి మారండి (48) అనే మహిళా కార్మికురాలు తన భర్త కుంచు మురుమూతో కలసి గత కొంతకాలంగా ఈ పేపర్ పరిశ్రమలో పనిచేస్తోంది. భర్త కొద్దిరోజుల క్రితమే సొంతూరుకి వెళ్లగా, సిమోతి ఇక్కడే ఉంటూ నిత్యం లాగే శనివారం విధులకు హాజరైంది.

మధ్యాహ్నం భోజనం ముగించుకుని తిరిగి విధుల్లోకి వెళ్లిన సమయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె వేసుకున్న దుస్తులు రన్ అవుతున్న పేపర్ మిషన్లో ఇరుక్కుపోయింది. క్షణాల్లో ఆమె యంత్రంలోకి లాగబడి, మిషన్లో పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

గుట్టుచప్పుడు కాకుండా... మృతదేహం తరలింపు

ప్రమాదం జరిగిన వెంటనే యజమాన్యం వ్యవహరించిన తీరుపై తోటి కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనను బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించే ప్రయత్నం చేశారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న యంత్రాల వద్ద రక్షణ గ్రిల్స్, సేఫ్టీ గేర్లు లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికులతో పనులు చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గేటు వద్ద కార్మికుల ఆందోళన.. రంగంలోకి పోలీసులు

విషయం తెలిసిన వెంటనే తోటి జార్ఖండ్ కార్మికులు, స్థానికులు పెద్ద ఎత్తున పరిశ్రమ గేటు ముందుకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతి చెందిన మహిళ కుటుంబానికి తగిన పరిహారం చెల్లించి న్యాయం చేయాలని, భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న ఎస్త్స్ర శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్ ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రస్తుతం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచినట్లు ఎస్త్స్ర తెలిపారు.

మరిన్ని వార్తలు