అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కలెక్టరేట్ ముట్టడి

02-11-2026 | 09:39pm

జగిత్యాల,(విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్లు(Anganwadi Teachers), హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (AITUC) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్(Collector B. Satya Prasad)కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల సాయిశ్వరి, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఏశమేని గణేష్ అంగన్వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి అంగరీ భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, హెల్త్ కార్డులు, రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలని కోరారు.

అంగన్వాడీ సిబ్బందికి అదనంగా కేటాయిస్తున్న బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఐసీడీఎస్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ బిల్లులు, టీఏ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన సిబ్బందికి రావాల్సిన ప్రయోజనాలను తక్షణమే అందించాలని, అర్హత, సీనియారిటీ ఆధారంగా గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, దయావతి, లక్ష్మీ, లావణ్య, శారద, వనిత, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు సుతారి రాములు, అందే వంశీ,  ఎండి, ఉస్మాన్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రామిల్ల రాంబాబు, మనోహర్ దితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు