గోదావరి పుష్కరాలు 2027కు పకడ్బందీ ఏర్పాట్లు

25-11-2026 | 04:39pm

జగిత్యాల, నవంబర్ 25 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ తాత్కాలిక ఏర్పాట్ల ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(Collector Satyaprasad) ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గోదావరి పుష్కరాలు–2027 తాత్కాలిక ఏర్పాట్లపై జిల్లా శాఖాధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు.. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పుష్కరాలకు జిల్లాలోని వివిధ ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత, వసతి తదితర అన్ని అంశాలపై ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

భక్తులు జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి పుష్కర స్నానాలు, దేవాలయ దర్శనం, భోజనం, విశ్రాంతి అనంతరం తిరిగి వెళ్లే వరకు ప్రతి దశలో అవసరమైన సౌకర్యాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీ, ఘాట్ల ప్రాధాన్యత, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా పుష్కర ఘాట్లను మూడు కేటగిరీలుగా విభజించి టైయర్ I, టైయర్ I I, టైయర్ I I I ( Tier-I, Tier-II, Tier-III ) వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఏ ఘాట్‌లోనూ తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భక్తుల భద్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

అవసరాలకు అనుగుణంగా పరిమాణాలు, వ్యయాల అంచనాలు రూపొందించాలి....

ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, అదనంగా అవసరమయ్యే వసతులు, భూములు, సామగ్రి, వాహనాలు, సిబ్బంది వివరాలతో సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. రోజువారీ భక్తుల సంఖ్యతో పాటు అత్యధిక రద్దీ రోజుల్లో గంటలవారీగా వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి, పుష్కరాల 12 రోజుల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

కేవలం మొత్తం వ్యయాన్ని ప్రతిపాదించకుండా ఎంతమంది భక్తులకు ఎన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీటి కేంద్రాలు, పార్కింగ్ స్థలాలు, వైద్య శిబిరాలు, బారికేడ్లు, లైటింగ్ సదుపాయాలు అవసరమవుతాయో పరిమాణాల వారీగా అంచనా వేయాలని తెలిపారు. ప్రతి పనికి యూనిట్ ధర, మొత్తం పరిమాణం, 12 రోజుల నిర్వహణ వ్యయం, సిబ్బంది అవసరాలను స్పష్టంగా పొందుపరచాలన్నారు.

అంచనా వేసిన భక్తుల సంఖ్య కంటే 10 నుంచి 15 శాతం అదనంగా భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన సామర్థ్యంతో ఏర్పాట్లను ప్రతిపాదించాలని సూచించారు. టాయిలెట్లు, చేంజింగ్ రూమ్‌లు, షామియానాలు, టెంట్లు, బారికేడింగ్, లైటింగ్, వైద్య సామగ్రి, వీల్‌చైర్లు, వాహనాలు తదితర ఏ విభాగంలోనూ కొరత రాకుండా చూడాలన్నారు. ముఖ్యమైన పర్యటనలు, వీఐపీల రాక సందర్భంగా అవసరమయ్యే అదనపు వాహనాలు, ఇతర సౌకర్యాలకు కూడా ముందుగానే బడ్జెట్‌లో కేటాయింపులు ప్రతిపాదించాలని తెలిపారు. అత్యవసర సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా మూడు షిఫ్టుల్లో సిబ్బంది నియామకానికి ప్రణాళిక రూపొందించాలన్నారు.

శాఖల వారీగా సమగ్ర ఏర్పాట్లకు ఆదేశాలు....

రెవెన్యూ శాఖ పార్కింగ్, హోల్డింగ్ ఏరియాలు, టెంట్ సిటీ, తాత్కాలిక బస్టాండ్లు, అన్నదాన కేంద్రాలు, హెలిప్యాడ్లకు అవసరమైన భూములను గుర్తించి సర్వే నంబర్ల వారీగా వివరాలు సేకరించాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఘాట్ల వద్ద నీటిమట్టం, నదీ ప్రవాహం, లోతు, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి బారికేడింగ్, హెచ్చరిక బోర్డులు, రక్షణ ఏర్పాట్లకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

దేవాదాయ శాఖ భక్తుల క్యూలైన్లు, నీడ షెడ్లు, ప్రసాదం, అన్నదానం, పిండప్రదానం, పాదరక్షల భద్రత, లాకర్లు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పోలీస్ శాఖ ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్‌మెంట్, వాహనాల రాకపోకలు, పార్కింగ్, సీసీ కెమెరాలు, వాచ్ టవర్లు, లాస్ట్ అండ్ ఫౌండ్ కేంద్రాలు, మహిళల భద్రత, అత్యవసర మార్గాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు, మహిళల దుస్తులు మార్చుకునే గదులు, తాగునీరు, చెత్త సేకరణ, నిరంతర పారిశుధ్య నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలు నీటి నిల్వ ట్యాంకులు, పైపులైన్లు, నీటి శుద్ధి, డ్రైనేజీ సదుపాయాలపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ ఘాట్ల వద్ద వైద్య శిబిరాలు, అంబులెన్సులు, అత్యవసర మందులు, ఆక్సిజన్, సమీప ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, అగ్నిమాపక, మత్స్య, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు, నదీ భద్రత, అత్యవసర రక్షణ చర్యలపై కార్యాచరణ రూపొందించాలన్నారు.

విద్యుత్ శాఖ ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, పాదచారుల మార్గాలు, హోల్డింగ్ ఏరియాల్లో నిరంతర విద్యుత్, లైటింగ్, జనరేటర్ బ్యాకప్ ఏర్పాటు చేయాలని, రవాణా శాఖ, టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, షటిల్ సర్వీసులు, తాత్కాలిక బస్టాండ్ల ద్వారా భక్తుల రవాణాకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళలు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు, శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌చైర్లు, ర్యాంపులు, ప్రత్యేక మరుగుదొడ్లు, ప్రత్యేక క్యూలైన్లు, సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.

ఆహార భద్రత శాఖ అన్నదాన కేంద్రాలు, తాత్కాలిక ఆహార విక్రయ కేంద్రాల్లో నాణ్యత, పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని, పర్యాటక శాఖ తాత్కాలిక వసతి, టెంట్ సిటీ, పర్యాటక సమాచార కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. సమాచార పౌర సంబంధాల శాఖ భక్తులకు అవసరమైన సమాచార బోర్డులు, ఘాట్ల మ్యాపులు, దిశా సూచికలు, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర ఫోన్ నంబర్ల ప్రచారం, మీడియా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇవి ప్రాథమిక ప్రతిపాదనలు మాత్రమేనని, భూముల లభ్యత, వాస్తవ అవసరాలు, భద్రత, వ్యయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఈ నెల 27లోగా ప్రతిపాదనలు సమర్పించాలి...

అన్ని శాఖాధిపతులు ఘాట్ వారీగా అవసరాల అంచనా, తాత్కాలిక పనుల ఆర్థిక అంచనాలు, సిబ్బంది అవసరాలు, భూముల వివరాలు, ఇతర శాఖలతో సమన్వయ అంశాలను నిర్దేశిత ప్రొఫార్మాలో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అంచనాకు స్పష్టమైన ప్రాతిపదిక, యూనిట్ ధరలు, అవసరమైన పరిమాణాలు పొందుపరచాలని, పనుల పునరావృతం లేకుండా సంయుక్త క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని తెలిపారు.

అధికారులు సంబంధిత శాఖల సిబ్బందితో కలిసి ప్రతిపాదనలపై తక్షణమే కసరత్తు ప్రారంభించాలని, అవసరమైన వారికి ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. పనుల అంచనాల్లో తాత్కాలిక నిర్మాణాలు, సామగ్రి కొనుగోలు లేదా అద్దె, రవాణా, సిబ్బంది వేతనాలు, విద్యుత్, ఇంధనం, 12 రోజుల నిర్వహణ వ్యయంతో పాటు పుష్కరాల అనంతరం నిర్మాణాల తొలగింపు, భూముల పునరుద్ధరణ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ప్రతిపాదనలు ముందుగానే సమర్పించడం ద్వారా వాటిని సమగ్రంగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. చివరి దశలో పార్కింగ్, బారికేడింగ్ వంటి ప్రధాన ఏర్పాట్ల సమయంలో ఎలాంటి కొరత, ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

గోదావరి పుష్కరాలు 2027ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, సంబంధిత శాఖల జిల్లా  అధికారులు, కలెక్టరేట్ ఏవో కిషన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు