ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల నూతన భవనం ప్రారంభం
తండ్రి శ్రీపాదరావు ఆశయాలకు అనుగుణంగా కళలకు ప్రోత్సాహం
మంథనిలో సంగీత కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
మంథని, నవంబర్ 25 (విజయక్రాంతి): కళలు, సాహిత్యం, సంస్కృతికి మంథని ప్రాంతం నిలయంగా మారాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆకాంక్షించారు. చిన్నారుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు సంగీతం, నృత్యం ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మంథని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల నూతన భవనాన్ని బుధవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన తండ్రి, దివంగత నేత స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రారంభించిన సంగీత, నృత్య విద్యా కార్యక్రమాలు నేడు మరింత అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందన్నారు. విద్యతోపాటు కళలు కూడా పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మంథని ప్రాంతానికి చెందిన చిన్నారులు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తమ కళా ప్రదర్శనలతో ప్రతిభను చాటుకోవడం గర్వకారణమన్నారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు కళారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు.
మంథని ప్రాంతం కళలు, సాహిత్యం, సంస్కృతికి ప్రతీకగా, సరస్వతి నిలయంగా మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. సంగీతం, నృత్య రంగాల్లో చిన్నారులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సరస్వతి, నటరాజుల ఆశీస్సులు చిన్నారులందరిపై ఉండాలని, వారు భవిష్యత్తులో మంథని ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.