కంటికి రెప్పలా లయన్స్ క్లబ్.. నిరుపేదల జీవితాల్లో వెలుగులు
ధర్మపురి, నవంబర్25 (విజయక్రాంతి): వెల్గటూర్‌లో నూతనంగా ఏర్పాటైన శాతవాహన లయన్స్ క్లబ్(Sathavahana Lions Club) ఆధ్వర్యంలో కేడీసీసీ బ్యాంకు ఆవరణలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. గొల్లపల్లి మండల లయన్స్ క్లబ్, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.శిబిరంలో వందలాది మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 24 మందిని కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించారు.
వారికి రవాణా, లెన్సులు, మందులు తదితర సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామింగ్ చైర్మన్ గుండా జగదీశ్వర్ ఆధ్వర్యంలో రోగులు, వారి సహాయకులకు భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మెన కుమార్, వైద్య వెంకటేష్, జూపాక కిరణ్, లయన్స్ సభ్యులు, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు గండ్ర ప్రతాప్ రావు పాల్గొన్నారు.