పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
అప్పుల భారం ఉన్నా సంక్షేమ పథకాల అమలులో రాజీ లేదు
రాష్ట్రవ్యాప్తంగా 4.7 లక్షల కొత్త చేయూత పింఛన్లు మంజూరు
మంథని డివిజన్లో 2,464 మందికి కొత్త పింఛన్లు.. రేపటి నుంచే ఖాతాల్లో నగదు జమ
మంథనిలో నూతన చేయిత పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
మంథని, నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గత ప్రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
బుధవారం మంథని పట్టణ సమీపంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు 200 మంది మహిళలకు కళ్యాణలక్ష్మి చెక్కులు, 117 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు సుమారు 4.7 లక్షల కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మంథని నియోజకవర్గ పరిధిలోని కమాన్‌పూర్, మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో 2,464 మందిని కొత్త పింఛన్లకు అర్హులుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలతో భరోసా
రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వివరించారు. ఈ పథకం అమలుకు ఇప్పటివరకు ఆర్టీసీకి సుమారు రూ.13 వేల కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, 25 లక్షల మంది రైతులకు సుమారు రూ.21 వేల కోట్ల మేర రుణమాఫీ అమలు చేశామని చెప్పారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం, సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నామని వివరించారు. అర్హులైన కుటుంబాలకు 16 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు అందించినట్లు తెలిపారు.
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో అధికారులు ప్రత్యేక శిబిరాల ద్వారా కుటుంబ వివరాలు సేకరిస్తున్నారని, ప్రతి కుటుంబం తమ నామినీ వివరాలను అధికారులకు అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా ప్రయోజనం అందేలా ప్రజలు సహకరించాలని కోరారు.
రేపటి నుంచే కొత్త పింఛన్ల నగదు జమ
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు కమాన్‌పూర్, మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో 2,464 మంది కొత్త చేయూత పింఛను లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చేశామని, గురువారం నుంచే వారి బ్యాంకు ఖాతాల్లో పింఛను సొమ్ము జమ కానుందని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు.
జూన్ 2027 నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పూర్తి చేయాలి
అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి అడవి సోమనపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు. ఇప్పటివరకు 40 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నాణ్యతలో రాజీ పడకుండా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి, అంటే జూన్ 2027లో తరగతులు ప్రారంభమయ్యేలా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పనుల పురోగతిని కలెక్టర్ నిరంతరం పర్యవేక్షించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మునిసిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుగుల సయేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కొత్త పింఛను లబ్ధిదారులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.