15వ వార్డులో ప్రమాదకరంగా మారిన మురికి కాలువ

13-09-2026 | 02:54pm

జనగామ, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో ఉన్న మురికి కాలువ ప్రజలకు ప్రమాదకరంగా మారింది. కాలువ శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మురికి కాలువ పైకప్పు లేకుండా, పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా ఉంది. రోజూ పాఠశాలకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు ఈ కాలువ పక్క నుండే నడవాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు కాలువను గమనించక ప్రమాదాలకు గురవుతున్నారు.

వర్షం వస్తే మురికి నీరు రోడ్లపైకి వచ్చి ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు వాపోతున్నారు. కాలువలో పేరుకుపోయిన చెత్త, మురికి వల్ల తీవ్ర దుర్గంధం వస్తోందని, దోమల బెడద పెరిగి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని వార్డు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఫిర్యాదు చేసినా మరమ్మతులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న మురికి కాలువకు వెంటనే మరమ్మతులు చేయాలని, లేదా కొత్త కాలువను నిర్మించాలని 15వ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత స్పందించే కంటే ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు