జిల్లా ఏర్పాటుతో న్యాయవాదులకు అవకాశాలు పెరిగాయి

12-10-2026 | 09:29pm

జిల్లా దశాబ్ది ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే గండ్ర

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally district) ఏర్పాటుతో స్థానికంగా న్యాయవాదులకు అవకాశాలు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) అన్నారు. జిల్లా ఏర్పాటు జరిగి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా నేడు మూడవ రోజు జిల్లా కోర్టు నందు న్యాయవాదులను, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్ కార్యాలయ, జిల్లా అధికారులను, మెడికల్ కళాశాల స్టాఫ్, విద్యార్థులను గండ్ర కలిసి వారికి పుష్పగుచ్చాలు అందజేసి , స్వీట్లు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్(District Bar Association) తరుపున కేసీఆర్(KCR) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా మార్చడం ద్వారా పరిపాలనా సౌకర్యాలు ప్రజలకు చేరువయ్యాయని తెలిపారు. జిల్లా ఏర్పాటుతో కలెక్టర్, ఐపీఎస్, జిల్లా జడ్జి, అధికారులు స్థానికంగానే అందుబాటులో ఉండడంతో సమీకృత కలెక్టర్ సముదాయ నిర్మాణం, వివిధ ప్రభుత్వ కార్యాలయాల సేవలు ఒకే చోట అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల(Government Medical College) ఏర్పాటు, ఆసుపత్రి నిర్మాణం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం గత మూడేళ్లలో అభివృద్ధి విషయంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని, ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం కంటే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. మిగిలిన కాలంలోనైనా జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, భూపాలపల్లి జిల్లా మరింత ప్రగతి సాధించేలా పాలకులు కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు