నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి
రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి
ములుగు,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కానందున రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి(Additional Collector Ch. Mahender G.) తెలిపారు. సాగునీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంచుకొని, నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని తెలిపారు.
సోమవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాదు నుంచి పలువురు ఉన్నతాధికారులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల్లోని రైతు వేదికల్లో పాల్గొన్న సంబంధిత శాఖల అధికారులు, రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, సాగునీటి లభ్యత, ఆరుతడి పంటల సాగుపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు(Farmers) వరి సాగు చేయవద్దన్నారు. బిందు సేద్యంతో పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయవచ్చన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోర్వెల్స్ రీఛార్జ్, తదితర పనులను చేపట్టి జలవనరులను కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో అధిక మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉందని, ప్రభుత్వం త్వరలోనే కరువు మండలాలను ప్రకటిస్తుందన్నారు.
వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. భూగర్భ జల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ నివేదికలను అందజేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలోని 22 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా
పలు శాఖల అధికారులు, గ్రామస్తులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ను తిలకించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు తో కలిసి హాజరయ్యారు. వీసి అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు.
ఎల్ నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆరుతడి పంటల సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కలిగేందుకు విస్తృతంగా అన్ని మాధ్యమాల ద్వారా, కళాజాత బృందాలతో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. రైతులు నష్ట పోకుండా ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, ఆరుతడి పంటల సాగుపై క్షేత్రస్థాయిలో రైతులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డిఆర్డిఓ రవీందర్, డిసిఎస్ఓ ఫైజల్ హుస్సేన్, డిఎం డిసిఎస్ఓ క్రిష్ణవేణి, డి ఎంహెచ్ ఓ గోపాలరావు, సిపిఓ జవహర్, డిపిఆర్ఓ రఫిక్, తదితరులు పాల్గొన్నారు.