విద్యార్థులు సమాజంపై అవగాహన పెంచుకోవాలి
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
వ్యాసరచన పోటీ విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ
భూపాలపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులు సమాజంపై అవగాహన పెంచుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetti Sankeerth) అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలను(Police Flag Day Week) పురస్కరించుకుని విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, అధికారులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఎస్పీ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు(Cybercrimes), గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలు, బాలల భద్రత, రోడ్డు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యార్థుల దృష్టికి వచ్చే అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి విక్రయాలు, సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలి.
సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. పోలీస్ ఫ్లాగ్ డే పోలీస్ అమరవీరుల త్యాగాలను, ప్రజల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలను గుర్తుచేసుకునే ముఖ్యమైన సందర్భమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, వర్టికల్ డీఎస్పీ రెహమాన్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.