బురదలోనే... ప్రయాణం

17-09-2026 | 04:15pm

వాగవతలి గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు

గణపురం,(విజయక్రాంతి): వెళ్తుర్లపల్లి, కొండాపూర్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణం(Construction of bridge) పూర్తయి నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. గణపురం మండలం(Ganapuram Mandal) నుండి కొండాపూర్ మీదుగా గుర్రంపేట వరకు రాకపోకలు సాగించేందుకు మోరంచ వాగుపై రూ.15 కోట్లతో వంతెన నిర్మించినప్పటికీ, వంతెనకు ఇరువైపులా రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు వంతెనకు ఇరువైపులా బురదమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.

ముఖ్యంగా వాగవతలి గ్రామాల ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రయాణించేందుకు అవస్థలు పడుతున్నారు. వంతెన నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆశించిన ప్రజలకు రహదారి లేకపోవడంతో నిరాశే మిగిలింది. వంతెనకు అనుసంధానంగా ఇరువైపులా వెంటనే రహదారి నిర్మించి, సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు