సింగరేణిలో ఉద్యోగుల సంక్షేమంతో పాటు క్రీడలకు ప్రాధాన్యం
ఏరియా కంపెనీ స్థాయి లాన్ టెన్నిస్, బాస్కెట్బాల్ టోర్నమెంటులో జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 15 ( విజయక్రాంతి ) : సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమంతో(Welfare of Singareni Company Employees)పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ అన్నారు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలో నిర్వహిస్తున్న కంపెనీ స్థాయి లాన్ టెన్నిస్, బాస్కెట్బాల్ టోర్నమెంట్లను జీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ముందుగా క్రిష్ణకాలని అంబేద్కర్ క్రీడా మైదానంలోని అంబేద్కర్ విగ్రహానికి జీఎం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఒలంపిక్ జెండా ఆవిష్కరించిన తదుపరి కంపనీలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రీడలు ఉద్యోగులలో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు, జట్టుగా పనిచేసే సామర్థ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
వివిధ ఏరియాలకు చెందిన క్రీడాకారులు ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా తమ ప్రతిభను చాటుకోవడంతో పాటు పరస్పర స్నేహభావం, ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం రామన్ వి పాఠక్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, సీనియర్ పీఒ సాయికృష్ణ ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేశ్, ఐఎన్టీయూసీ నాయకులు బేతెల్లి మధూకర్ రెడ్డి, సీఎంఓఐఏ అద్యక్షులు నజీర్ , స్పొర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, స్పొర్ట్స్ కో ఆర్డినేటర్ నాగేశ్వర్ రావు , స్పొర్ట్స్ రెఫరీలు తదితరులు పాల్గొన్నారు.