నాటు బాంబుల పేలుళ్ల బాధితులకు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ...
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి విజ్ఞప్తి...
బాన్సువాడ, నవంబర్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో జరిగిన నాటు బాంబుల పేలుళ్ల(Bomb Blast) ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
పేలుళ్లలో గాయపడిన బాధితులు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, అందే రాజు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసుల విచారణ అనంతరం స్పష్టత రానుంది.