దోమకొండ కోట, గ్రామ అభివృద్ధి ట్రస్ట్ సేవాకార్యక్రమం
పేదరికంపై చలి పంజా: బాసటగా నిలిచిన దోమకొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
దోమకొండ సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): చలికాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే నిరుపేద, అవసరమైన కుటుంబాలకు అండగా నిలిచేందుకు దోమకొండ కోట, గ్రామ అభివృద్ధి ట్రస్ట్ ముందుకొచ్చింది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అవసరమైన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామ పంచాయతీ సూచన మేరకు ఆయా వార్డులలో దుప్పట్లు అవసరమైన కుటుంబాలను వార్డు సభ్యులు గుర్తించి వారి వివరాలను అందజేయాలని ట్రస్ట్ ప్రతినిధులు సూచించారు. ప్రతి వార్డుకు సుమారు 120 దుప్పట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దుప్పట్లు అందేలా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, అవసరాల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. చలికాలంలో దుప్పట్లు అందించడం ద్వారా నిరుపేద కుటుంబాలకు కొంతైనా ఉపశమనం కలిగించాలన్నదే తమ లక్ష్యమన్నారు. సేవా కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉప సర్పంచ్ బొమ్మర్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ఆనంద్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుమల్ గౌడ్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, లత రాజేందర్, కాటికే శ్రీనివాస్, మధు, కాంగ్రెస్ అధ్యక్షుడు అశోబోయిన శ్రీనివాస్ దోమకొండ కోట, గ్రామ అభివృద్ధి ట్రస్ట్ ప్రతినిధులు బాబ్జి జలాది, గణేష్ యాదవ్, వినయ్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.