22 కోట్ల ఆసుపత్రికి స్థల గండం!
- ఏడాదిన్నరగా ముందుకు సాగని నిర్మాణం..
- దేవునికుంట స్థలంపై అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూపులు
- రూ.22 కోట్ల నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం!
- నాలుగు ఎకరాలు స్థలం కోసం అధికారుల వేట..!
దోమకొండ, అక్టోబర్ 15 (విజయక్రాంతి): దోమకొండ(Domakonda) మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మంజూరైన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం స్థల సమస్యతో ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.22 కోట్ల నిధులు మంజూరు చేసి ఏడాదిన్నర గడుస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసి అధికారులకు నివేదిక అందించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభం కాకపోతే మంజూరైన నిధులపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు ఎకరాలు కావాలి.. అందుబాటులో ఉన్నది 1.20 ఎకరాలే!
50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సుమారు నాలుగు ఎకరాల స్థలం అవసరమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే దోమకొండ గ్రామపంచాయతీ పాలకవర్గం స్థానిక దేవునికుంట ప్రాంతంలో సుమారు 1.30 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదిస్తూ తీర్మానం చేసి తహసీల్దార్కు నివేదిక పంపినట్లు తెలిసింది.
అవసరమైన స్థలంతో పోలిస్తే ప్రతిపాదించిన భూమి విస్తీర్ణం తక్కువగా ఉండటంతో నిర్మాణానికి అనుకూలతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆసుపత్రి భవన నిర్మాణంతో పాటు రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు, వాహనాల పార్కింగ్, ఇతర మౌలిక వసతులు కల్పించాలంటే సరిపడా స్థలం అవసరం. ఈ నేపథ్యంలో దేవునికుంటలో ప్రతిపాదించిన స్థలం ఆసుపత్రి నిర్మాణానికి సరిపోతుందా? సాంకేతికంగా అనుకూలంగా ఉందా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
కుంట స్థలంలో నిర్మాణం సాధ్యమేనా?
గతంలో దేవునికుంట ప్రాంతంలో నీరు నిల్వ ఉండటం, అక్కడి నేల మెత్తగా ఉండటంతో ఆసుపత్రి నిర్మాణానికి ఆ స్థలం అనుకూలంగా ఉండకపోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ భవనం నిర్మిస్తే పునాదుల పటిష్టత, భవిష్యత్తులో భవన భద్రతపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మరోవైపు, ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయ భూమిని గుర్తించాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.
పలుమార్లు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కూడా ఆసుపత్రి స్థలం కోసం స్థానిక నేతలను చివాట్లు పెట్టినట్లు సమాచారం. దేవునికుంట స్థలంలోనే నిర్మాణం చేపట్టాలంటే ముందుగా భూమి స్వభావం, విస్తీర్ణం, యాజమాన్య వివరాలు, నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. నిపుణుల, ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రాధికారుల నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
స్థలం కోసం కాంట్రాక్టర్ ఎదురుచూపులు!
ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగుతున్నప్పటికీ, స్థల ఎంపికలో జాప్యం కారణంగా పనులు ప్రారంభం కావడం లేదని తెలుస్తోంది. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఖరారు చేసి అప్పగిస్తే పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కానీ ఏడాదిన్నరగా స్థల సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రాజెక్టు అమలులో జాప్యం కొనసాగుతోంది. టీఎస్ఎంఐడిసి నిధుల టెండర్ పూర్తయిన స్థలం ఎంపిక కాకపోవడంతో కాంట్రాక్టర్ అన్ని అనుమతులు కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు.
రూ.22 కోట్లతో నిర్మించాల్సిన ఆసుపత్రికి నిధులు మంజూరైనప్పటికీ, స్థల సమస్య కారణంగా నిర్మాణం ప్రారంభం కాకపోవడం ప్రజలకు నిరాశ కలిగిస్తోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు ప్రారంభం కాకపోతే నిధుల వినియోగంపై ప్రభావం పడుతుందా? నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉందా? అనే విషయాలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
చిన్న రోగాలకూ కామారెడ్డికే వెళ్లాల్సిన పరిస్థితి!
ప్రస్తుతం దోమకొండలోని 30 పడకల ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మెరుగైన వైద్యం అవసరమైన రోగులను కామారెడ్డి ఆసుపత్రికి పంపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర వైద్యం అవసరమైనప్పుడు దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దోమకొండలో 50 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో చికిత్స పొందేందుకు వీలవుతుంది. ముఖ్యంగా పేదలు, గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలి
దేవునికుంటలో ప్రతిపాదించిన స్థలం ఆసుపత్రి నిర్మాణానికి సరిపోకపోతే అధికారులు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూమిని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. ఒకే చోట అవసరమైన విస్తీర్ణంలో భూమిని ఎంపిక చేసి, అన్ని శాఖల అనుమతులు పొందిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి స్థల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ప్రజారోగ్యానికి ఎంతో కీలకమైన 50 పడకల ఆసుపత్రి నిర్మాణం మరోసారి జాప్యానికి గురికాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంజూరైన నిధులు వృథా కాకుండా, ఆసుపత్రి దోమకొండలోనే నిర్మితమయ్యేలా చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
రెవిన్యూ నివేదిక అడిగాం.. ఇరిగేషన్ తరపున ఎలాంటి డినోటిఫికేషన్ ఇవ్వలేదు..
దోమకొండ 50 పడగల ఆసుపత్రి విషయంలో స్థలం నిర్ణయం కోసం ఎమ్మార్వో నివేదిక అడిగాము ఎమ్మార్వో నివేదిక ఇచ్చాక ఇరిగేషన్ ఎస్సి ద్వారా కలెక్టర్కు నివేదికలు పంపుతాం.ఆస్పత్రి నిర్మాణానికి ఎలాంటి డినోటిఫికేషన్ దేవునికుంట స్థలంలో ఇవ్వలేదు ,ఇట్ ఇస్ అండర్ ప్రాసెస్ ఇరిగేషన్ తరపున ఎలాంటి డి నోటిఫికేషన్ ఆసుపత్రి నిర్మాణం కోసం నోటిఫికేషన్ ఇవ్వలేదు ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు అనుమతి ఉంటుందా లేదా తెలియదు పూర్తిస్థాయి నివేదికలు ఇంకా రాలేదు సిద్ధమవుతున్నాయి నివేదికలు జిల్లా కలెక్టర్ కి శాఖ తరపున పంపిస్తాం