పేదలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
యూపీహెచ్సీలకు అభివృద్ధికి కృషి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన కేంద్ర మంత్రి
ముషీరాబాద్, అక్టోబర్15 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్సీ) మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగైన వైద్య సేవల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి(Union Minister Kishan Reddy) తెలిపారు. గురువారం కవాడిగూడలోని డీబీఆర్ మిల్స్ యూపీహెచ్సీతో పాటు ముషీరాబాద్ మెయిన్ రోడ్డులోని యూపీహెచ్సీ, మెట్టుగూడలోని ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.
ఆయా కేంద్రాలకు అవసరమైన వైద్య పరికరాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఈసీజీ యంత్రంతో కూడిన బెడ్లు తదితర పరికరాలను సమకూర్చారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భరత్ గౌడ్, రమేష్ రామ్, జి. వెంకటేష్, సలంద్రి శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.