దసరా ధరల మోత

16-10-2026 | 05:15am

కరీంనగర్, అక్టోబరు 15 (విజయక్రాంతి): దసరా పండుగ(Dussehra Festival) దగ్గరపడుతుండగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నా యి. నిత్యావసరాల ధరలు పెరగటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా పండుగ సమయంలో కుటుంబాలు పిండివంటలు చేసుకుంటారు. నూనె, పంచదార, పప్పులు ఇలా అవసరం అయిన నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. 

ఈసారి ధరల మోత కారణంగా ఇళ్ల బడ్జెట్లు భారంగా మారాయి. సన్నబియ్యం కిలో 82 రూపాయల వరకు చేరింది. 26 కిలో ల బస్తా గతంలో 1,500 ఉండగా ఇప్పుడు 2,050 రూపాయలకు పెరిగింది. కూరగాయల ధరలు సగటున 42 శాతం పెరిగాయి. టమాటా కిలో 40, వంకాయ 40, బీరకాయ 60, పచ్చి మిర్చి 100 రూపాయలు కిలో పలుకుతున్నాయి. కందిపప్పు కిలో 145, మినపగుళ్లు 135 నుండి145, శనగపప్పు 95 నుండి105గా ఉన్నాయి. పంచదార 75, బెల్లం 80కి చేరగా ఉల్లి కిలో 60 రూపాయలు పలుకుతుంది. 

బతుక్కమ్మ పేర్చేది ఎలా..?

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండుగల వేళ పూల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో ప్రకృతిసిద్ధంగా బీడు భూములు, చేల గట్లపై ఉచితంగా లభించే గునుగు, తంగేడు పూలను కూడా ఇప్పుడు మార్కెట్లో భారీ ధరలు చెల్లించి కొనాల్సి రావడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పండుగ ఖర్చులు మోయలేని భారంగా మారాయి. గునుగు పూలు 3 నుండి 4 కట్టలు 100 నుండి 120 రూపాయలు, తంగేడు పూలు ఒక చిన్నకట్ట 100, బంతి పూలు కిలో 150 నుండి 200 వరకు, చామంతి పూలు కిలో  300 నుండి 400 వరకు, గులాబీలు కిలో 200  నుండి  250 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి.- 

ముక్క నోటికి పొయ్యేది ఎట్లా..?

దసరా పండుగ సీజన్లో  మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. పండుగ వేళ ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు పెరిగిన ధరలు గట్టి షాక్ ఇస్తున్నాయి. దసరా డిమాండ్తో పాటు పౌల్ట్రీ రవాణా, దాణా ఖర్చులు పెరగడం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి. ప్రస్తుతం మటన్ పొట్టేలు కిలో 800 నుండి 900 రూపాయలు పలుకుతుండగా ఆదివారం నుండి వెయ్యి, 1100 కు పెంచాలని నిర్ణయించారు. బ్రాయిలర్ స్కిన్ లెస్ కిలో 300 కు పెంచాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు