తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
సాగర్ సొసైటీలో వేడుకలకు హాజరు
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మాత్రమే బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, విశిష్ట సంస్కృతికి ప్రతీకగా అత్యంత ఘనంగా జరుగుతుందని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి(Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం, బంజారాహిల్స్ పరిధిలోని సాగర్ సొసైటీలో గురువారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు.
మహిళలతో కలిసి కాసేపు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ అంటేనే ఆటపాటల సమ్మేళనమని, పూలను పూజించే అద్భుతమైన సంస్కృతి మనదని కొనియాడారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు, ఆడపడుచులకు ప్రధాని నరేంద్ర మోదీ, చింతల రామచంద్రారెడ్డి తరఫున శుభాకాంక్షలు ప్రకటించారు. ప్రజలందరికీ ఎలాంటి కష్టాలు లేకుండా ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సంతోషాలు ప్రసాదించాలని గౌరమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా, దేశానికి నిరంతరం సేవలందిస్తున్న మోదీ పూర్ణాయుష్షుతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా ఆ తల్లి దీవించాలని వేడుకున్నారు.