రైతన్నల గోస పట్టదా?
- సాగు నీరు లేదు.. సరిగ్గా కరెంట్ లేదు
- ఎల్ నినో వేళ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
- సమస్యలను పక్కనబెట్టి ‘ఓట్ చోరీ’ డ్రామాలు
- కలాం సేవలను కాంగ్రెస్ కించపరిచింది
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్రావు విమర్శలు
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో రాష్ర్టంలో సాగు నీటి సమస్య, విద్యుత్ కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు(BJP state president Ramchander Rao) విమర్శించారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా కాంగ్రెస్ నేతలు ‘ఓట్ చోరీ’ అంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాంచందర్రావు ముఖ్య అతిథిగా హాజరై కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. బోర్లపై ఆధారపడి సాగు చేసే రైతులకు రోజుకు కనీసం రెండు గంటల పాటు కూడా నాణ్యమైన విద్యుత్ అందడం లేదని ఆరోపించారు. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. 22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర సమస్యలను పరిష్కరించడం చేతగాని కాంగ్రెస్ నేతలు.. ఢిల్లీ వెళ్లి ‘ఓట్ చోరీ’ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని రాంచందర్ రావు విమర్శించారు. అధికారులు తన మాట వినడం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం పాలనలోని పరిస్థితికి నిదర్శనమని ఆయన అన్నారు. గాంధీ అనే పేరుతో వీరికి ఎటువంటి సంబంధం లేదని, రాహుల్, ప్రియాంక, సోనియా.. వీరంతా గాంధీ పేరు ను అక్రమంగా వాడుకుంటున్న ‘నకిలీ గాం ధీలు’ అని ఎద్దేవా చేశారు.
దేశంలో అంతర్గత కల్లోలాలకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయంటూ అమెరికాకు చెందిన ఓ గాయని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాడు సీఏఏ వ్యతిరేక ఉద్యమం పేరిట షహీన్ బాగ్ను నెలరోజుల పాటు దిగ్బంధించి దేశద్రోహ శక్తులకు కాంగ్రెస్ వత్తాసు పలికిందని, అమెరికా అధ్యక్షుడి పర్యటన వేళ దేశ పరువు తీసేలా అల్లర్లకు ఆజ్యం పోసిన చరిత్ర వీరిదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖలోని 11.4 లక్షల మంది ఉద్యోగులకు 78 రోజుల బోనస్ కింద రూ.2,009.61 కోట్లు మం జూరు చేయడంపై రాంచందర్రావు హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగుల పెన్షన్కు గతంలో 80 శాతంగా ఉన్న అర్హతను 40 శా తానికి తగ్గించడం ద్వారా మరింత మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
సామాన్య కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం తన ప్రతిభతో దేశ అత్యున్నత పదవి ని అలంకరించడమే కాకుండా, రక్షణ రంగంలో కీలక సేవలందించారని కొనియాడారు. అయితే కలాం సేవలను, అణు పరీక్షలను కాంగ్రెస్ పార్టీ కించపరిచిందని, నాడు పార్లమెంటులో సోనియాగాంధీ, చిదంబరం వంటి నేతలు కలాంను ‘బాంబ్ మ్యాన్’ అంటూ హేళన చేశారని పేర్కొన్నారు. యువత కలాంను ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావా లని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వైట్ కేన్ డే సందర్భంగా బీజేపీ దివ్యాంగుల సెల్ ఆధ్వర్యంలో దృష్టిలోపం ఉన్న పలువురికి వైట్ కేన్ స్టిక్స్ అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా, దివ్యాంగుల సెల్ నాయకులు, పార్టీ ప్రతినిధులుపాల్గొన్నారు.
22- ఏ పేరిట వ్యవస్థీకృత భూ దోపిడీ
తెలంగాణలో 22-ఏ నిషేధిత జాబితా పేరుతో లక్షలాది మంది భూ యజమానులు, రైతులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు పేర్కొన్నారు. పట్టా భూములు, వ్యవసాయ క్షేత్రాలు, ప్లాట్లను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ, వాటి తొలగింపు పేరుతో భారీ అవినీతి దందాకు తెరలేపారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 22 ఏపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి సంపాదనకు ప్రధాన వనరుగా మారిందని ఆరోపించారు. క్రమబద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగి, 20 నుంచి 30 ఏళ్లుగా ప్రజల ఆధీనంలో ఉన్న వ్యవ సాయ భూములు, ప్లాట్లను సైతం రాత్రికి రాత్రే నిబంధనలకు విరుద్ధంగా 22-ఏ జాబితాలో చేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ జాబితా నుంచి పేర్లను తొలగించుకోవాలంటే బాధితులు భారీగా లంచాలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని, ఇందుకు నిదర్శనంగానే ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రెవె న్యూ అధికారులు ఏసీబీ వలలో చిక్కుకుంటున్నారని గుర్తుచేశారు. తమ సొంత ఆస్తులు తమకు దక్కుతాయో లేదోనన్న ఆందోళనతో సామాన్య ప్రజలు, రైతులు ఏళ్ల తరబడి కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఈ అక్రమాలకు ఉదాహరణలను ప్రస్తావిస్తూ శామీర్పేట మండలం బొమ్రాస్పేటలో సుమారు 1,500 ఎకరాల భూములను ఏకపక్షంగా నిషేధిత జాబితాలో చేర్చడంతో అక్కడి రైతాంగం ఆందోళనలో మునిగిపోయిందని పేర్కొ న్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లో సైతం ఒకే సర్వే నంబర్లో ఏదో ఒక చిన్న ప్లాట్ వివాదంలో ఉందో లేక ప్రభుత్వ భూమి ఉందన్న నెపంతో, ఆ సర్వే నంబర్లోనని మొత్తం భూమినంతటినీ 22-ఏ జాబితాలో చేరుస్తున్నారని తప్పుబట్టారు.