ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించండి
- వ్యవసాయానికి కీలకమైన సమయం
- నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలి
- నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలి
- తాగునీటికి ముందస్తు ఏర్పాట్లు చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
- సంగారెడ్డి జిల్లా అధికారులతో సీఎస్ సమీక్ష
సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రానున్న రోజులు పంటల సం రక్షణకు కీలకమైన సమయమని, వ్యవసా య..విద్యుత్‌శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు(Telangana Chief Secretary Sanjay Jaju) సూచించారు. ఎల్ నినో ప్రభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావంతో నీటి లభ్యత, వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గురువారం సీఎస్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సింగూరు జలాశయంలో నీటి నిల్వలను పరిశీలించారు. అనంతరం పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో టాన్స్‌కో సీఎండీ జితేష్ వి.పాటిల్, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తాగునీటి సరఫరా ప్రత్యామ్నాయాలపై చర్చించారు. సింగూరు జలాశయ నీటిమ ట్టం, జిల్లాలో తాగునీటి లభ్యత, వర్షపాతం, పంటల సాగు పరిస్థితులు, తాగునీటి సరఫరా ప్రణాళికల గురించి కలెక్టర్ ప్రతీక్ జైన్ సీఎస్‌కు వివరించారు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని సూచించారు. అగ్రిమెంటేషన్ అవసరమైన పనులన్నింటినీ నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
రానున్న రోజులు పంటల రక్షణకు అత్యంత కీలకమని, వ్యవసాయ అధికారులు రైతులకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాజరిగేలా చూడాలన్నారు. ఆరుతడి, స్వల్పకాలిక పంటలను సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వీబీజీ రామ్ జీ పథకం కింద నీటి సంరక్షణ పనులు, నీటి నిల్వ కుంటల నిర్మాణం వంటి పనులను చేపట్టాలని తెలిపారు. అనంతరం చౌటకూర్‌లో కౌలు రైతు గొల్ల మహేష్ ఏడు ఎకరాల్లో పత్తి పంటను సీఎస్ పరిశీలించారు. తక్కువ నీటితో సాగు చేయగల పం టలను సాగు చేయాలని సూచించారు.