వైభవంగా శ్రీ చాముండేశ్వరి దేవి 55వ వార్షికోత్సవం
తొలిసారిగా 108 మంగళహారతులతో శిఖర హారతి
దోమకొండ, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ చాముండేశ్వరి దేవస్థానంలో(Sri Chamundeshwari Temple) అమ్మవారి 55వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
వేడుకల్లో భాగంగా ఉదయం 9.15 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి నిర్వహించే మహాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.తొలిసారిగా 108 మంగళహారతులతో శిఖర హారతి,వార్షికోత్సవంలో భాగంగా సాయంత్రం 7.15 గంటలకు ఆలయ చరిత్రలో తొలిసారిగా 108 మంగళహారతులతో శిఖర హారతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు అమ్మవారి మహాప్రసాదంతో పాటు గాజులు, కుంకుమ, రక్షా కంకణం అందజేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.