సాగునీరు అందక ట్యాంకర్‌తో పొలానికి నీళ్లు..
కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు ఆవేదన!
నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నాగిరెడ్డిపేట్ మండలం మెల్లకుంట తండా గ్రామంలో సాగునీటి సమస్యతో రైతు వసరం నాయక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తన పొలానికి నీళ్లు అందకపోవడంతో పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకెళ్లి పొలానికి పోసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సదుపాయాలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉండగా, రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి అదనపు ఖర్చులు భరించాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది.ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాను మెరుగుపరచడంతో పాటు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.మెల్లకుంట తండాలో రైతు వసరం నాయక్ ఎదుర్కొంటున్న పరిస్థితి వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై చర్చకు దారితీస్తోంది. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, పంటలను కాపాడుకునేందుకు అవసరమైన సహకారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సాగునీరు మరియు విద్యుత్ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.