కరెంట్ కష్టాలు.. కన్నీటి సాగు!

13-10-2026 | 05:05am

ఎల్‌నినో ప్రభావంతో అడుగంటుతున్న భూగర్భ జలాలు

లో వోల్టేజీతో దెబ్బతింటున్న ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు

పొట్ట దశలోనే నీరందక బీటలు వారుతున్న వరి పొలాలు

భిక్కనూర్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతకు ఇప్పుడు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ‘రైతే రాజు’ అన్న మాటలు ఆచరణలో మాత్రం కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటుతుండగా, మరోవైపు లో వోల్టేజీ విద్యుత్ సరఫరా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వరి పంట పొట్ట దశకు చేరుకున్న సమయంలో నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. పచ్చగా కళకళలాడాల్సిన వరి చేలు నీటి కోసం ఎదురుచూస్తుండగా, భూమి బీటలు వారి పగుళ్లు ఏర్పడుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఆరాటం వర్ణనాతీతంగా మారింది.

లో వోల్టేజీ.. రైతులకు శాపం

వ్యవసాయానికి కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న లో వోల్టేజీ సమస్య రైతులకు తలనొప్పిగా మారింది. తక్కువ వోల్టేజీతో మోటార్లు సక్రమంగా పనిచేయకపోవడంతోపాటు ట్రా న్స్ఫార్మ ర్లు, మోటార్లు, స్టార్టర్లు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. పరిక రాలు కాలిపోవడంతో మరమ్మతుల కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పంటకు నీరందక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు విద్యుత్ పరికరాల మరమ్మతులు ఆర్థిక భారంగా మారుతున్నాయని చెబుతున్నారు.

వేడెక్కి తెగిపడుతున్న వైర్లు

పలు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ల నుంచి వ్యవసాయ మోటార్లకు వెళ్లే విద్యుత్ వైర్లు వేడెక్కి తెగిపడి కింద పడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి మోటార్లు పనిచేయడం లేదు. వైర్ల మరమ్మతులు పూర్తయ్యే వరకు పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. తెగిపడిన విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉండటంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

భిక్కనూర్ మండలం లోని పలు గ్రామాల్లో ఒకేసారి మూడు నుంచి నాలుగు వైర్లు తెగిపడుతున్న సందర్భాల్లో విద్యుత్ సిబ్బంది కోసం ఎదురుచూడకుండా రైతులే మరమ్మతుల పనులు చేపడుతున్నారని చెబుతున్నారు. అయితే విద్యుత్ వైర్ల మరమ్మతులు ప్రమాదకరమైన పని కావడంతో రైతులు స్వయంగా వాటిని తాకడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. అధికారులు, విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతు న్నారు.

మరమ్మతుల కారణంగా గం టల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నా, కోల్పోయిన సమయానికి బదులుగా అదనపు విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న తమకు విద్యుత్ అంతరాయాలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయని, నిలిచిపోయిన సరఫరాకు బదు లుగా అదనపు సమయం కేటాయించాలని కోరుతున్నారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో భూగర్భ జలాల లభ్యతపై రైతుల్లో చర్చ జరుగుతోంది. బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు నీటి లభ్యత తగ్గడం మరింత సమస్యగా మారింది. బోర్లలో నీరు తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఒకేసారి ఎదురవడంతో పంటలను కాపాడుకోవడం కష్టమవుతోంది. పొట్ట దశలో వరికి తగినంత నీరు అందకపోతే దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, కూలీల కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని ఆవేదన చెందుతున్నారు.

పంట మార్పిడి ఎలా సాధ్యం?

యాసంగిలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు మళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే ప్రస్తుత వానాకాలం పంటను కాపాడుకోవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో రైతులు భవిష్యత్ సాగుపై ఆందోళన చెందుతున్నారు. పంట మార్పిడి చేయాలంటే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన, మార్కెట్ సదుపాయాలు, పెట్టుబడులకు తగిన భరోసా అవసరమని రైతులు అభిప్రాయపడుతున్నారు. నీటి లభ్యతను బట్టి పంటను ఎంచుకోవడంతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి తగిన సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.

అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు

పంటలు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించి నాణ్యమైన సరఫరా అందించాలని రైతులు కోరుతున్నారు. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, స్టార్టర్ల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని, తెగిపోయిన వైర్లకు వెంటనే మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లో వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు మరమ్మతుల కారణంగా నిలిచిపోయిన విద్యుత్కు బదులుగా అదనపు సరఫరా అందించాలని కోరుతున్నారు. భూగర్భ జలాల పరిస్థితిని అంచనా వేసి రైతులకు సాగు సలహాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యుత్ సరఫరా మెరుగుపడి, పంటలకు సకాలంలో నీరు అందితేనే తమ కష్టానికి ఫలితం దక్కుతుందని రైతులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు