పాలపిట్టను కాపాడుదాం ప్రకృతిని రక్షిద్దాం
నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభమని నమ్మకము ఉంది. కానీ దానిని బంధించి ప్రదర్శించడం తప్పు. పాలపిట్ట రైతు నేస్తం. మిడతలు గొల్లభామలు ఇతర హానికర కీటకాలను తింటూ పంటలకు మేలు చేస్తుంది. ధాన్యపు గింజలు దాని సహజహారం కాదు. బంధించడం వల్ల సరైన ఆహారం అందక అది నీరసించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారము పాలపిట్టను బంధించడం ప్రదర్శించడం చట్టరీత్యా నేరం.
ఎవరైనా బంధించినట్టు తెలిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నాగిరెడ్డిపేట్ అటవీ శాఖ రేంజ్ ఎఫ్ఆర్వో వాసుదేవ్(Forest Range Officer Vasudev) తెలిపారు. మన పాలపిట్ట ప్రకృతి మిత్రుడు. పాలపిట్ట మన తెలంగాణ రాష్ట్ర పక్షి ప్రకృతి సమతుల్యతను జీవవైవిద్యాన్ని కాపాడుటలో కీలక పాత్ర పోషిస్తుంది. రైతులకు మిత్రమైన ఈ అందమైన పక్షిని దాని ఆవాసలను కాపాడటం మనందరి బాధ్యత అని, పాలపిట్టను కాపాడుదాం ప్రకృతిని రక్షిద్దాం అంటూ నాగిరెడ్డిపేట్ మండల రేంజ్ ఎఫ్ఆర్వో వాసుదేవ్ తెలిపారు.