అమరుల స్ఫూర్తితో సమాజ సేవ చేయాలి

24-10-2026 | 07:13pm

జిల్లా పోలీసు కార్యాలయంలో రక్తదాన శిబిరం.

435 యూనిట్ల రక్తం సేకరణ

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): అమరవీరుల స్ఫూర్తితో(Inspiration of the Martyrs) సమాజ సేవ చేయాలనే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ(Commemoration of Police Martyrs) (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాల్లో భాగంగా  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో  మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరానికి పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, యువత, ఆటో డ్రైవర్లు, వివిధ సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసినట్లు తెలిపారు. 435 యూనిట్ల రక్తాన్ని దానం చేశారన్నారు.

సమాజ శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల సురక్షిత/స్వేచ్చయుత భవిష్యత్తు కోసం తమ అమూల్యమైన ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయం అని అన్నారు. నేడు మనమందరం సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నామంటే... అది మన వీర పోలీసుల ప్రాణ త్యాగాల ఫలితమే నన్నారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహించే 'పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలు' కేవలం ఒక కార్యక్రమం కాదు  అని, సమాజం కోసం ప్రాణాలర్పించిన మన వీరుల పట్ల కృతజ్ఞతను చాటుకునే పవిత్ర సమయం అని అన్నారు. వారి అమరత్వానికి నివాళిగా, సమాజానికి మేలు చేకూరేలా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో అర్థవంతమైనదని అన్నారు.

రక్తదానం అనేది మరొకరి ప్రాణాన్ని కాపాడే అత్యున్నత మానవీయ సేవ అన్నారు. విశ్వంలో ఎన్ని విజ్ఞాన విప్లవాలు వచ్చినా, మానవ రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యపడలేదు అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న బాధితుడికి, ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తం ఒక కొత్త జీవితాన్ని, ఆ కుటుంబానికి కొండంత భరోసాను ఇస్తుందన్నారు.

స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడమంటే మరొకరికి జీవదానం చేయడమే అన్నారు. ఆరోగ్యంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలి అని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఇచ్చిన ఈ పిలుపునకు స్పందించి, అమరవీరుల స్ఫూర్తితో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేసిన మన పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వివిధ సంఘాల ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు, అమరుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం, ప్రాణ రక్షణ కోసం పునరంకితం కావాలని కోరారు.

రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి జిల్లా పోలీసు శాఖ, తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హెల్మెట్లను పంపిణీ చేశారు.

ఈ రక్తదాన శిబిరంలో జిల్లా అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, డిఎస్పిలు మధుసూదన్, శ్రీనివాసరావు, విట్టల్ రెడ్డి,  ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సంజీవ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  రాష్ట్ర  సభ్యులు జైపాల్ రెడ్డి , తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులు, ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్  బాలు,  పోలీసు సిబ్బంది, విద్యార్థులు, కాలేజీ యజమానులు, పలు కాలేజీల ప్రిన్సిపాల్స్, యువకులు, ఆటో డ్రైవర్లు, వివిధ సంఘాల సభ్యులు రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు