భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
రైతులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి
సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో కడాస్ట్రల్ మ్యాపులు లేని గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్(CCLA Commissioner Lokesh Kumar) అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, భూ కొలతల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... రీ సర్వే(Land Resurvey)లో రైతులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నివసించని రైతుల వివరాలు, వారి ఫోన్ నంబర్లను వ్యవసాయ అధికారుల ద్వారా సేకరించి సమన్వయం చేసుకోవాలన్నారు. సర్వేకు ముందుగానే రైతులకు సమాచారం అందించాలని, అటవీ హక్కులను గుర్తిస్తూ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో కడాస్ట్రల్ మ్యాపులు లేని గ్రామాలను గుర్తించి మొదటి విడత సర్వే పూర్తి చేశామని తెలిపారు. రెండో విడతలో మండలానికి రెండు గ్రామాల చొప్పున భూముల రీ సర్వే చేపడుతున్నట్లు వివరించారు.
సర్వే వివరాలను గ్రామాల్లో టాంటాం ద్వారా ప్రచారం చేయడంతో పాటు, దూర ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే ఏడీ వినయ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.