6 September, 2026 | 9:11 PM

తాండూర్‌ త్రిలింగ రామేశ్వరాలయానికి పునర్‌వైభవం

06-09-2026 | 08:29pm

నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): మండలంలోని తాండూర్ త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు, డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయ అభివృద్ధికి, ఆలయ పునర్ వైభవానికి కావలసిన అవసరాలను ఆలయ కమిటీ సభ్యులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

ఇంతటి వైభవోపేతమైన కళాఖండం, సూర్యకాంతి పడటం లాంటి అద్భుతాలను కలిగినటువంటి దేవాలయం ఇంత మారుమూల ప్రాంతంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని, ఇంతటి ప్రశాస్త్రమైన దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయవలసిన అవసరం ఉందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు తాండూర్ త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని సందర్శించి, పునర్ వైభవానికి కావలసిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు వారు తెలిపారు.

ఇంతటి ప్రశాస్తమైన, ఎన్నో అద్భుతాలను కలిగి మరుగునపడిన దేవాలయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికి, పునర్ వైభవానికి కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఆలయానికి మొట్టమొదటిసారిగా వచ్చిన రాష్ట్ర స్థాయి డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావును ఆలయ కమిటీ, గ్రామ పెద్దల తరఫున ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తాండూర్, అక్కంపల్లి గ్రామాల సర్పంచులు భూమాయాద గౌడ్, వెంక గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు, ఉపసర్పంచ్ అభిషేక్, కమిటీ ఉపాధ్యక్షులు మునిగేపల్లి సంగయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మురళి గౌడ్, నాగిరెడ్డిపేట మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దివిటీ కిష్టయ్య, నాయకులు వేముల సంగయ్య, లింగం, రమేష్, నీల సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.







మరిన్ని వార్తలు